జేఎన్‌యూపై తగ్గేదిలేదు! | Not limited on JNU | Sakshi
Sakshi News home page

జేఎన్‌యూపై తగ్గేదిలేదు!

Published Thu, Feb 18 2016 1:10 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Not limited on JNU

దూకుడుగా పార్లమెంటు సమావేశాల్లో చర్చకు బీజేపీ సిద్ధం
 
 న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను కూడా గందరగోళం చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతుండటంతో.. అధికార బీజేపీ అస్త్ర, శస్త్రాలను నూరుతోంది. ముంబై దాడులకు సంబంధించి హెడ్లీ వాంగ్మూలం (ఇషత్ ్రజహాన్ ఎన్‌కౌంటర్) తోపాటు జేఎన్‌యూ అంశంపై విపక్షాలకు దీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

 జన్ స్వాభిమాన్ అభియాన్..
 జేఎన్‌యూలో జాతి వ్యతిరేక కార్యక్రమాలపై విపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ.. ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు ‘జన్ స్వాభిమాన్ అభియాన్’ పేరుతో బీజేపీ దేశవ్యాప్త కార్యక్రమాలు చేపట్టనుంది. ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు జేఎన్‌యూ వాస్తవాలను చెప్పనున్నారు. ‘ఐక్యత, సమగ్రత, అభివృద్ధి’ నినాదంతో కార్యక్రమాలు జరుగుతాయి.

 లాయర్ల ఒక్కరోజు దీక్ష
 దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయటం లేదని నిరసిస్తూ ఢిల్లీలోని కర్కర్‌దూమా జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు ఒక్కరోజు దీక్ష నిర్వహించారు. దీంతో కోర్టు కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. అడ్వొకేట్ల దుస్తులు ధరించి వచ్చిన కొందరు ఆగంతకులు పటియాలా కోర్టు ఆవరణలో జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారని న్యాయవాదులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ సందర్భంగా ఓ న్యాయవాది సుప్రీం కోర్టులో నినాదాలు చేశారు. దీంతో ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్, సప్రేల ధర్మాసనం ఈ అనూహ్య ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

 గిలానీ తరహాలోనే మరికొందరిని!
 అఫ్జల్ అనుకూల నినాదాలు చేసిన ఢిల్లీ వర్సిటీ మాజీ లెక్చరర్ గిలానీని దేశద్రోహం కింద అరెస్టు చేసిన కేసులో మరికొందరిని చేర్చనున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరికొందరిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో భారత వ్యతిరేక నినాదాలు చేసినందుకు గిలానీపై దేశ ద్రోహం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కన్హయ్యను అరెస్టు చేసిన రోజే వర్సిటీ ప్రొఫెసర్లు అలీ జావెద్, నిర్మలాంశు ముఖర్జీ, త్రిప్త వహీలను పోలీసులు విచారించారు. వీరంతా ప్రెస్‌క్లబ్‌లో గిలానీతోపాటు వేదికపై ఉన్నారని పోలీసులు తెలిపారు. 2001లో పార్లమెంటుపై దాడి కేసులో గిలానీని అరెస్టు చేసినా.. ఆధారాలు లేక 2003లో ఢిల్లీ కోర్టు గిలానీని విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement