ఐఐటీ ప్రవేశాలు సరళం
బోర్డు పరీక్షల్లో మొత్తం మార్కుల ఆధారంగా ప్రవేశాలు
యథావిధిగా టాప్ 20 పర్సెంటైల్ నిబంధన
చెన్నై: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ప్రవేశాలకు నిబంధనలు సరళతరం చేశారు. ఇకపై ఐఐటీ ప్రవేశాల్లో ప్లస్ 2 లేదా ఇంటర్మీడియెట్‌లో విద్యార్థులు సాధించిన మొత్తం మార్కులను పరిగణనలోకి తీసుకోనున్నారు. అయితే టాప్ 20 పెర్సెంటైల్ నిబంధనను యథావిధిగా కొనసాగించనున్నారు. ఈ మేరకు చెన్నైలోని ఐఐటీ మద్రాస్‌లో సోమవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షతన జరిగిన 48వ ఐఐటీల మండలి సమావేశంలో నిబంధనలను సరళీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి అశోక్ ఠాకూర్ విలేకరులకు వివరించారు. ఐఐటీల్లో ప్రవేశాల కోసం టాప్ 20 పర్సెంటైల్ నిబంధనతో పాటు బోర్డు పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మొత్తం మార్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు. అన్ని ఐఐటీలు, వివిధ వర్గాలతో చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఐఐటీ మండలి తాజా నిర్ణయం వల్ల అనేక మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
ప్రస్తుతం బోర్డు పరీక్షల్లో టాప్ 20 పర్సెంటైల్‌లో నిలిచిన విద్యార్థులకు మాత్రమే దేశంలోని 16 ఐఐటీల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. ఇందుకోసం వీరంతా జేఈఈ అడ్వాన్స్ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాలి. అయితే గత ఏడాది సుమారు 200 మంది విద్యార్థులు జేఈఈలో టాప్ స్కోర్లు సాధించినా.. టాప్ 20 పర్సెంటైల్‌లో లేకపోవడంతో ఐఐటీలో ప్రవేశాలు దక్కించుకోలేకపోయారు. సవరించిన నిబంధనల వల్ల ఒక విద్యార్థి టాప్ 20 పర్సెంటైల్ కేటగిరీలో లేకపోయినా.. కౌన్సిల్ నిర్దేశించిన కనీస మార్కులు సాధించినట్లయితే ఐఐటీల్లో ప్రవేశం పొందవచ్చు. కొత్త నిబంధన ప్రకారం.. ఓబీసీ, జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్థులు బోర్టు పరీక్షల్లో 75 శాతం మార్కులు, ఎస్‌సీ, ఎస్‌టీ, వికలాంగ విద్యార్థులైతే 70 శాతం మార్కులు సాధించాలి. వీరంతా జేఈఈ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. మరోవైపు కొన్ని కోర్సులకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌తో ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరదించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.