ఢిల్లీ: ఓలా, ఊబర్ ట్యాక్సీ సర్వీసులపై ఢిల్లీ ప్రభుత్వం కన్నెర్రజేసింది. దేశ రాజధానిలో సరి-బేసి విధానం అమలు చేస్తున్న సమయంలో తమ రేట్లను మూడునుంచి ఐదు రెట్లకు పెంచి ప్రయాణీకుల జేబులు కొల్లగొడుతున్న ఈ ట్యాక్సీ సర్వీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు.
ట్యాక్సీ సర్వీసులు విమాన ప్రయాణపు చార్జీలను తమ నుంచి వసూలు చేస్తున్నాయని ప్రయాణీకులు వాపోతున్నారు. మామూలు సమయంలో మూడు రెట్లు, రద్దీ సమయంలో ఐదు రెట్లు చార్జీలు వసూలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. 'గతంలో నేను ఇంటి నుంచి అఫీసుకు వెళ్లడానికి రూ.400 అయ్యేది. ఇప్పుడు ఏకంగా రూ.2100 అవుతోంది' అని వసంత్ కుంజ్ కు చెందిన పునీత్ గులాటి వాపోయారు.
దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వ సరి-బేసి విధానాన్ని పాజిటివ్ గా అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ రేట్లకు మించి అధికంగా రేట్లను వసూలు చేసే టాక్సీల లైసెన్సులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. చేంజ్ ఆర్గనైజేషన్ సభ్యులు పెరిగిన టాక్సీ ధరలకు వ్యతిరేకంగా వెయ్యి మంది సంతకాలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఊబర్, ఓలా సర్వీసులపై అమన్ గార్గ్ కోర్టులో కేసును నమోదు చేశారు. గతంలో బెంగళూరులో ట్యాక్సీ రేట్ల పెంపుకు వ్యతిరేకంగా అమన్ కేసు వేశారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది.