‘జెట్‌’ సిబ్బందికి కొత్త రెక్కలు | offers for jet airways employees | Sakshi
Sakshi News home page

Apr 27 2019 5:23 PM | Updated on Apr 27 2019 5:28 PM

 offers for jet airways employees - Sakshi

బిల్లులు పేరుకుపోతున్నాయి. మా పిల్లల పాఠశాలల, కాలేజీల ఫీజులను చెల్లించాల్సి ఉంది. ఇక ఈఎంఐలు సరేసరి. మా పరిస్థితి భయానకంగా ఉంది.

సాక్షి, న్యూఢిల్లీ : ‘బిల్లులు పేరుకుపోతున్నాయి. మా పిల్లల పాఠశాలల, కాలేజీల ఫీజులను చెల్లించాల్సి ఉంది. ఇక ఈఎంఐలు సరేసరి. మా పరిస్థితి భయానకంగా ఉంది. మా సహచరుల్లో కొంత మంది ఇప్పటికే 40 శాతం తక్కువ జీతాలకు ఇతర ఉద్యోగాలు వెతుక్కున్నారు’ అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్‌ మీడియాతో వాపోయారు. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రైవేట్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ను తాత్కాలికంగా మూసివేయడంతో అందులో పనిచేసే వివిధ కేటగిరీలకు చెందిన దాదాపు 20 వేల మంది ఉద్యోగులకు ఈ పరిస్థితి ఏర్పడింది. కొంత మంది సిబ్బంది 40 శాతం తక్కువకు ఇతర ఉద్యోగాల్లో చేరిపోయారని చెబుతున్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య దారుణంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఉద్యోగాలు దొరకడమే విశేషం. 

అంతకన్నా విశేషం ఏమిటంటే, జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది దుస్థితి గురించి తెలిసి అనేక స్టార్టప్, కార్పొరేట్‌ కంపెనీలే కాకుండా ప్రత్యర్థి ఎయిర్‌వేస్‌ కంపెనీలు కూడా వారిని పిలిచి ఉద్యోగాలు ఇస్తున్నాయి. చెన్నైలో ఉంటున్న ఓ చిన్నపాటి పుస్తకాల పబ్లిషర్‌ తన వద్ద రెండు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, రోడ్డున పడ్డ జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులకు ఇవ్వాలని అనుకుంటున్నానని, తదుపరి వివరాలకు తనను సంప్రతించాల్సిందిగా మొట్టమొదట ట్వీట్‌ చేశారు. దాంతో స్టార్టప్‌లతో సహా పలు కార్పొరేట్‌ కంపెనీలు, పలు సంస్థల నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. తాను పదిమంది జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తానని, వారు పీజీ చేసి పౌర సంబంధాల్లో ఉద్యోగం చేయడానికి వీలుగా వడ్డీరహిత రుణాలను కూడా ఇస్తానంటూ ఒకరు, తమది ఎక్స్‌ప్రెస్‌ ఇన్‌ ఇండియా డాట్‌కామ్‌ అని, ఇప్పటికే ఓ కంపెనీలో పనిచేసిన అనుభవం ఉందంటే అది తమకు లాభించే అంశంగా పరిగణిస్తున్నామని, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులయితే వారికి కచ్చితంగా ప్రాధాన్యం ఇస్తామంటూ మరొకరు ఆఫర్‌ ఇచ్చారు. 

ఇలా ఉద్యోగాలు ఆఫర్‌ చేసిన వారిలో జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఉదాహరణకు జెట్‌ మాజీ ఉద్యోగి అమిత్‌ బీ వధ్వానీ ముంబైలో ‘సాయి ఎస్టేట్‌ కన్సల్టెంట్స్‌’ నడుపుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు, అమ్మకాలు, కొనుగోళ్ల ఆడిట్‌ లెక్కలు, మార్కెటింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, పబ్లిక్‌ రిలేషన్స్‌ తదితర విభాగాల్లో ఉద్యోగాలు ఇస్తానంటూ ఆయన ఆఫర్‌ ఇచ్చారు. ఇక క్యూర్‌ఫిట్, బౌన్స్, స్టేఎబోడ్‌ అనే స్టార్టప్‌ కంపెనీల్లో 150 ఉద్యోగాలను జెట్‌ ఉద్యోగులకు ఆఫర్‌ ఇచ్చారు. అమెరికాలోని ‘వియ్‌ వర్క్‌ డాట్‌ కామ్‌’ కూడా ఆఫర్‌ ఇచ్చింది. మంచి అనుభవం ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులను ప్రభుత్వ పౌర విమానయానంలోకి తీసుకుంటామని కేంద్ర పౌరవిమాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా ఏప్రిల్‌ 21వ తేదీన ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హామీ ఇచ్చారు. ఆయన తన హామీని నిలబెట్టుకుంటారో, లేదో తెలియదుగానీ, ఆయన హామీకి స్పందించిన ‘స్పైస్‌జెట్‌ ఎయిర్‌వేస్‌’ జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన వెయ్యి మంది సిబ్బంది వరకు ఉద్యోగాలు ఇస్తామంటూ ముందుకు వచ్చింది. ఇంతగా మానవత్వం పరిమళిస్తుందంటే అది సోషల్‌ మీడియా పుణ్యమేనని చెప్పాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement