నోట్ల మార్పిడికి రాం రాం!
⇒ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్‌కే రూ. 1,000 నోటు పరిమితం
⇒ 15వ తేదీ వరకు అనుమతించిన చెల్లింపులన్నీ పాత రూ. 500 నోట్లతోనే..
⇒ కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం
⇒ జాబితాలో తాజాగా మొబైల్ రీచార్జ్, స్కూలు ఫీజులు, కో-ఆపరేటివ్ స్టోర్లు
⇒ పౌరసేవల బిల్లుల్లో కరెంటు, నీటి బకాయిలకు మాత్రమే అవకాశం
⇒ డిసెంబర్ 2 వరకూ టోల్ ట్యాక్స్ రద్దు
న్యూఢిల్లీ
పెద్ద నోట్ల రద్దుతో కొనసాగుతున్న ప్రజల కష్టాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 24 అర్ధరాత్రి నుంచి డిసెంబర్ 15 వరకూ అనుమతించిన చోట్ల పాత 500 నోటును వాడుకోవచ్చని తెలిపింది. అదే సమయంలో బ్యాంకుల్లో రూ. 500, వెయ్యి నోట్ల మార్పిడిని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. ‘పౌర సేవల బిల్లులు(కేవలం నీటి, విద్యుత్ బిల్లుల చెల్లింపు) చెల్లించేందుకు డిసెంబర్ 15 వరకూ పాత రూ. 500 నోటు వినియోగించవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి నవంబర్ 25 నుంచి అందుబాటులో ఉండదు’ అని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇంత కుముందు ఈ గడువు డిసెంబర్ 30 వరకూ ఉంది.
నవంబర్ 8న నోట్ల రద్దుపై మోదీ ప్రకటన అనంతరం పౌర సేవల బిల్లులు, ఆస్పత్రుల్లో వైద్య ఖర్చుల కోసం, రైల్వే, బస్సు, విమాన టికెట్లకు , పెట్రోల్ బంకులతో పాటు పలుచోట్ల 500, వెరుు్య నోట్లను అనుమతించారు. ఈ గడువును నవంబర్ 24 వరకూ పొడిగిస్తూ వచ్చారు. గడువు ముగియడంతో గురువారం రాత్రి తాజా నిర్ణయం తీసుకున్నారు. అరుుతే ఇక నుంచి కేవలం రూ. 500 నోట్లు మాత్రమే స్వీకరిస్తారని, వెరుు్య నోట్లను ఎక్కడా తీసుకోరని, బ్యాంకులతోపాటు పోస్టాఫీసుల్లోని సేవింగ్స్ ఖాతాల్లో మాత్రమే డిపాజిట్ చేసుకోవాలని ఆర్థిక శాఖ పేర్కొంది.
ఎక్కడెక్కడ పాత 500 నోటు చెల్లుతుందంటే..
- పౌర సేవల బిల్లులు.. కేవలం విద్యుత్, నీటి బిల్లుల కోసమే.. బకాయిలు చెల్లించాలి.. ఆస్తి పన్ను చెల్లింపులకు వర్తించదు
- టోల్ ప్లాజాలు (డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకూ టోల్ వసూలు లేదు) డిసెంబర్ 3 నుంచి 15 వరకు చెల్లించవచ్చు
- పెట్రోల్ బంకులు.. శ్మశాన వాటికలు.. కోర్టు ఫీజులు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని పాల కేంద్రాలు
- ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య ఖర్చులకు
- డాక్టర్ చీటీతో అన్ని మందుల షాపుల్లో మందుల కొనుగోలుకు
- రైల్వే టికెట్ కౌంటర్లు, బస్సు టికెట్ కౌంటర్లు (ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సహకారంతో నడిచే బస్సులు), ఎరుుర్‌పోర్టు కౌంటర్లు
- ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొనుగోలుకు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపాలిటీ, స్థానిక సంస్థల స్కూళ్లలో ఒక్కో విద్యార్థి రూ.2 వేల వరకూ ఫీజులు చెల్లించవచ్చు.
- రాష్ట్ర ప్రభుత్వ విక్రయ కేంద్రాల నుంచి విత్తనాల కొనుగోలుకు
- మొబైల్ రీచార్జ్ కోసం.. ఒక రీచార్జ్‌కు ఒక్క నోటే తీసుకుంటారు.
- కన్సూమర్ కోఆపరేటివ్ స్టోర్ల నుంచి రూ. 5 వేల వరకూ కొనుగోళ్లకు
- విదేశీయులు వారానికి రూ. 5 వేల వరకూ విదేశీ కరెన్సీ మార్చుకోవచ్చు. వివరాలు పాస్‌పోర్టులో తప్పకుండా నమోదు చేయాలి.
- రైల్వే క్యాటరింగ్ సేవలకు, సబర్బన్, మెట్రో రైలు టికెట్ల కొనుగోలుకు
- చారిత్రక స్థలాల్లో టికెట్ల కొనుగోలుకు