30 మంత్రుల బృందాలను రద్దు చేసిన మోడీ సర్కారు ఆయా అంశాలపై ఇక మంత్రిత్వ శాఖలదే నిర్ణయం
న్యూఢిల్లీ: యూపీఏ పాలనావశేషాల తొలగింపు కార్యక్రమంలో భాగంగా.. ఆ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన 30 మంత్రుల బృందాలను(జీవోఎం) మోడీ సర్కారు రద్దు చేసింది. వాటిలో 9 సాధికార మంత్రుల బృందాలు(ఈజీవోఎం) కాగా, 21 సాధారణ జీవోఎంలు. విధాన నిర్ణయ ప్రక్రియను వేగవంతం చేయడం, వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ ఈజీవోఎంలు, జీవోఎంలకు నిర్దేశించిన విధులను ఆయా మంత్రిత్వ శాఖలు, సంబంధిత విభాగాలే నిర్వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇది మంత్రిత్వ శాఖలు, విభాగాలకు మరింత సాధికారత కల్పించే ఉద్దేశంతో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయమని పేర్కొంది.
నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఇబ్బందులు ఎదుర్కొనే పక్షంలో కేబినెట్ సెక్రటేరియట్, పీఎంవో సహకరిస్తాయని ఆ ప్రకటనలో తెలిపారు. మంత్రిత్వ శాఖల మధ్య ఏర్పడే వివాదాలపై కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ఈ జీవోఎంలలో చాలా వాటికి నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, ఇతర కీలక మంత్రులు చిదంబరం, శరద్ పవార్‌లు నేతృత్వం వహిస్తున్నారు. అవినీతి, రాష్ట్రాల మధ్య జల వివాదాలు, పాలనాసంస్కరణలు.. మొదలైన అంశాలపై ఆ జీవోఎంలను ఏర్పాటు చేశారు. వాటి సిఫారసులపై కేంద్ర కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునేది. ఏదైనా అంశంపై కేబినెట్ మంత్రుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు జీవోఎంలను ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఏర్పడితే చివరి నిర్ణయం ప్రధానిగా నరేంద్ర మోడీనే తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఆయనపై బాధ్యత మరింత పెరిగే అవకాశం ఉంది. జీవోఎంల ఏర్పాటు మొదట్లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. యూపీఏ పాలనలో అది మరింత విస్తృతమైంది.
ఈజీవోఎంలకు నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఉండేది. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 60 వరకు జీవోఎంలు ఏర్పాటయ్యాయి. అయితే అవి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఏళ్ల తరబడి సాగుతూ ఉండేవి. కాగా, ఆయా అంశాల సంక్లిష్టత, వాటిలో ఒకటికి మించిన మంత్రిత్వ శాఖల జోక్యం ఉన్నందువల్లనే మంత్రుల బృందాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటూ జీవోఎంల ఏర్పాటును కాంగ్రెస్ సమర్ధించుకుంది. అయితే, జీఓఎంల రద్దుపై ఎలాంటి విమర్శలు చేయకుండా.. తాము కోరుకున్న విధంగా పరిపాలన సాగించే హక్కు, అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని వ్యాఖ్యానించింది.
యూపీఏ జీవోఎంలపై వేటు
Published Sun, Jun 1 2014 1:59 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM
Advertisement
Advertisement