ప్రతీకాత్మక చిత్రం
ముంబై : ‘అయ్యా.. సీఎం సారూ.. నేను 2 లక్షల పెట్టుబడితో ఉల్లి పంట సాగు చేస్తే నాకు రూ.6 లాభం వచ్చిందయ్యా.. ఈ లాభాన్ని కూడా మీరే తీసుకొండి’ అని ఓ ఉల్లి రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు పంపించాడు. మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన శ్రేయాస్ అభలే అష్టకష్టాలు పడి 2657 కేజీల ఉల్లిని పండించాడు. మార్కెట్‌లో అమ్మేందుకు తీసుకెళ్లాడు.
దళారుల దెబ్బకు పంటకు కనీస మద్దతు ధర కూడా రాలేదు. కేజీ ఉల్లి కేవలం రూపాయే పలికింది. దీంతో అభలే కడపు మండి కంట కన్నీరు ఉబికింది. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ మొత్తాన్ని రాష్ట్ర సీఎంకు మనీ ఆర్డర్ ద్వారా పంపాడు. ఇలా అబలే నిరసన వ్యక్తం చేయడం దేశ వ్యాప్తంగా ఉన్న ఉల్లిరైతులు దయనీయ స్థితిని తెలియజేస్తోంది. మహారాష్ట్రలో ఉల్లి రైతు పరిస్థితి కల్లోలంగా మారింది. ఎంతో కష్టపడి పండించిన పంటకు కనీస ధర కూడా రావడం లేదు. రైతులు ఉల్లిని బాగా సాగుచేయడం.. దిగుబడి కూడా ఎక్కవగా రావడంతో ఉల్లి ధరలు అమాంతం పడిపోయాయి. కేజీ ఉల్లి ధర 50 పైసల నుంచి రూపాయి కూడా పలకడం లేదు.
అభలే తన పొలంలో పండిన 2657 కేజీల ఉల్లిని కేజీ రూపాయి చొప్పున గత శుక్రవారం హోల్‌సెల్ మార్కెట్‌లో అమ్మాడు. ట్రాన్స్‌పోర్ట్, కూలీల ఖర్చులు పోనూ.. అతని ఆరు రూపాయలు మాత్రమే వచ్చింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన అభలే మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.
‘2,657 కేజీల ఉల్లిని అమ్మితే నాకు రూ. 2,916 వచ్చాయి. రవాణ ఖర్చులు.. కూలీలు పోను రూ. 6 మిగిలాయి. ఈ ఏడాది రూ.2లక్షల పెట్టుబడితో ఉల్లి పంట సాగు చేశా. లాభాలేమో ఇలా ఉన్నాయి. ఇలా అయితే అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.’ అని బాధపడ్డాడు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన సంజయ్ సాథే అనే రైతు కూడా అతనికి వచ్చిన రూ.1064 లాభాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మనియార్డర్ ద్వారా పంపించి నిరసన వ్యక్తం చేశాడు. ఇక మద్దతు ధర లేక నాసిక్ జిల్లాల్లో ఇద్దరు ఉల్లి రైతులు బలవన్మరణం పొందారు.
Comments
Please login to add a commentAdd a comment