
మా మిషన్లు ఇస్తాం.. దమ్ముంటే హ్యాక్ చేయండి!
ఇన్నాళ్లుగా తాము ఎన్నికల్లో ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను (ఈవీఎం) ఈ నెలాఖరులో ఇస్తామని, దమ్ముంటే ఎవరైనా సరే వాటిని హ్యాక్ చేయడం లేదా ట్యాంపరింగ్ చేసి చూపించాలని ఎన్నికల కమిషన్ సవాలు చేసింది. మొత్తం 55 రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈసీ ఒక సమావేశం నిర్వహించింది. వాటిలో 16 పార్టీలు మళ్లీ బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాయి. దాంతో ఈసీ అధికారులు స్పందించి, తాము ఈ నెలాఖరులో ఓపెన్ చాలెంజ్ నిర్వహిస్తామని, అందులో ఎవరైనా సరే తమ ఈవీఎంలను ట్యాంపర్ చేసి చూపించాలని సవాలు చేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ కోర్టులలో ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి 37 కేసులు నమోదయ్యాయని, వాటిలో ఇప్పటికే 30 కేసుల్లో తీర్పులు రాగా, వాటన్నింటిలో కూడా ఈవీఎంలను ట్యాంపర్ చేయడం కుదరదనే చెప్పారని ఢిల్లీ రాజౌరి గార్డెన్ ఎమ్మెల్యే మన్‌జీందర్ సింగ్ సిర్సా తెలిపారు.
ప్రభుత్వం తలపెట్టిన వీవీపాట్ నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ స్వాగతించింది. ఇప్పటికే తమకు ఈ మిషన్ల కొనుగోలుకు సంబంధించి నిధులు కూడా అందాయని, 2019 నాటికి వీటిని ఉపయోగంలోకి తెస్తామని ఈసీ వర్గాలు తెలిపాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీలో హ్యాక్ చేసి చూపించింది తమ ఈవీఎంలా కనిపించేదే తప్ప అసలుది కాదని స్పష్టం చేశాయి. ఈవీఎంలు నూటికి నూరుశాతం కచ్చితమైనవనే విషయాన్ని ప్రతి భారతీయుడికి ఎన్నికల కమిషన్ చెప్పగలగాలని, అది వాళ్ల బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు.