
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు వెనుదిరగడం ప్రారంభమైందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) గురువారం తెలిపింది. ఈసారి ఈ ప్రక్రియ 12 రోజులు ఆలస్యంగా జరుగుతోందని పేర్కొంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఇంకా వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వర్షపాతం కొరత 5 శాతంగా ఉందని, వాయువ్య ప్రాంతాల్లో కొరత ఎక్కువగా నమోదైనట్లు ఐఎండీ డైరెక్టర్ కేజే రమేశ్ తెలిపారు. ‘సెప్టెంబర్ 27న జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్తాన్, హరియాణాలోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనక్కి మరలాయి. రాబోయే 48 గంటల్లో హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, ఇతర ప్రాంతాల నుంచి కూడా నైరుతి రుతుపవనాలు వెనుదిరిగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి’ అని చెప్పారు.