'మాట నిలబెట్టుకోలేకపోతే ఆయనేం ఆర్థికమంత్రి'
న్యూఢిల్లీ: మరోసారి ఓఆర్ఓపీ పెన్షన్ దారులు ఆందోళన బాట పట్టారు. వారంతా ఢిల్లీలోని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అధికారిక నివాసం ముందు దర్నాకు దిగారు. తమ ఆందోళనలు కేంద్ర ప్రభుత్వ పట్టించుకోవడం లేదని, తాము చేసిన సూచనలు పెడచెవిన పెడుతున్నారని ఆరోపిస్తూ ఆదివారం వారంతా జైట్లీ ఇంటిముందు నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగానే బారీకేడ్లు భారీ స్థాయిలో ఇంటి ముందుపెట్టించడమే కాకుండా పోలీసులను కూడా మోహరించారు.
మంత్రుల నివాసాల ముందు నేరుగా మాజీ సైనికులు పెన్షన్ల కోసం ధర్నాలకు దిగడం గడిచిన వారం రోజుల్లో ఇది రెండో సారి. 'ఇదే నెలలో 3న మేం ఇదే మంత్రి నివాసం ముందు ధర్నాకు వచ్చినప్పుడు ఆయన కేంద్ర రక్షన మంత్రితో మాట్లాడతామని హామీ ఇచ్చారు. వారంలోగా ఆ పని పూర్తిచేయాలని మేం కోరాం. కానీ ఇప్పటికీ రెండు వారాలు అవుతోంది. ఆయన మాత్రం ఏ విధంగాను స్పందించలేదు. ఆయన ఇచ్చిన మాటనే నిలబెట్టుకోలేకపోతే ఆయనను ఇక ఏం ఆర్థికమంత్రి అనుకోవాలి' అని వీకే గాంధీ అనే మాజీ సైనికుడు అన్నారు.