వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలుకు గ్రీన్ సిగ్నల్
► 2014 జూలై 1 నుంచి ఓఆర్ఓపీ అమలు
► నాలుగు విడతల్లో ఆరేసి నెలల్లో బకాయిల చెల్లిపు
► రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ ప్రకటన
న్యూఢిల్లీ: మాజీ సైనికుల కల ఫలించింది. 42 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 2014 జూలై ఒకటో తేదీ నుంచి అమలయ్యేలా ఓఆర్ఓపీని అమలుచేస్తామని, దీనికి సంబంధించిన బకాయిలను నాలుగు విడతల్లో ఆరేసి నెలలకు ఒకసారి చొప్పున ఇస్తామని తెలిపారు. యుద్ధ వితంతువులకు మాత్రం ఒకే సారి మొత్తం బకాయిలు చెల్లిస్తామన్నారు. ఐదేళ్లకోసారి పింఛనును సవరిస్తుంటామని పారిక్కర్ చెప్పారు. దీనివల్ల ఖజానాపై 8000 కోట్ల నుంచి 10000 కోట్ల వరకు ఖర్చవుతుంది. అలాగే బకాయిల చెల్లింపునకు మరో 10-12 వేల కోట్ల వరకు ఖజానాపై భారం పడుతుందని రక్షణ మంత్రి తెలిపారు.
మన భద్రతాదళాలు అపార ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నాయని, వీళ్లు శాంతి భద్రతలతో పాటు విపత్తులు వచ్చినప్పుడు కూడా తమ సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా పారిక్కర్ ప్రశంసించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా పెండింగులో ఉందని, దీనిపై ఇంతకు ముందు ప్రభుత్వాలు చాలావరకు నిర్లక్ష్యం వహించాయని చెప్పారు. యూపీఏ సర్కారు గతంలో ఒకసారి 500 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టినా, అది సరిపోతుందా లేదా అన్న విషయం ఆలోచించలేదని విమర్శించారు. దీన్ని అమలుచేయడానికి పాలనా పరమైన, సాంకేతిక, ఆర్థిక సమస్యలున్నాయని 2009లో పార్లమెంటులో చెప్పారన్నారు.
అందుకే ఈ ప్రభుత్వం కూడా ఓఆర్ఓపీ అమలుకు కొంత సమయం తీసుకుందని, అయినా ప్రధాని నరేంద్రమోదీ మాత్రం పలు సందర్భాల్లో ఓఆర్ఓపీని అమలు చేస్తామనే చెప్పారన్నారు. దీని అమలుకు నిపుణులు, మాజీ సైనికులతో చర్చించామని... అయితే వీఆర్ఎస్ తీసుకున్నవాళ్ల విషయంలోనే కొంత సమస్య వచ్చిందని పారిక్కర్ తెలిపారు. ఒకే ర్యాంకులో ఒకే సర్వీసు పూర్తిచేసిన వాళ్లకు ఎప్పుడు రిటైరయ్యారన్నదాంతో సంబంధం లేకుండా ఒకే తరహాలో ఇక మీదట పింఛను వస్తుందన్నారు.