
న్యూఢిల్లీ: లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవడం వల్ల ఆధార్ చట్ట విరుద్ధమని ప్రకటించలేమని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఆధార్ లేకపోవడం వల్ల ప్రజలు ప్రయోజనాలకు దూరం కాకూడదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరిస్తూ పై విధంగా స్పందించింది.
‘ఒక చట్టం చెల్లదని ప్రకటించడానికి అలాంటి సమస్యలు ప్రాతిపదికలు కావు’ అని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ పేర్కొంది. విచారణకు హాజరైన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ..ఆధార్ సమర్పించనందుకు కొందరు సీనియర్ సిటిజన్లకు పింఛన్లు నిరాకరించారని ఓ పత్రికలో వచ్చిన వార్తను ఉటంకించారు. కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సిబల్ వాదనలతో విభేదించారు. బయోమెట్రిక్ , ఐరిష్ లాంటివి పనిచేయకుంటే గుర్తింపు కార్డులుగా ఇతర ప్రత్యామ్నాయాలున్నాయని వేణుగోపాల్ అన్నారు.