గౌహతి : అసోంలో వరదలు పోటెత్తాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా ఒకరు మరణించినట్లు తెలుస్తోంది. బ్రహ్మపుత్ర, జై భారాలి నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. బార్పేట, నల్బరీ, గోల్ పారా, లక్ష్మీపూర్ తదితర తొమ్మిది జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. సుమారు 300 హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. లక్ష్మీపూర్ జిల్లాలో ఒకరు కొట్టుకుపోయారు.
అసోం రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటి వరకు 9 జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. దాదాపు 60వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీనిపై అసోం డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అప్రమత్తమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరిస్థితిని అంచనా వేస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని, వరద ఉధృతి నుంచి గట్టెక్కేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని సీనియర్ అధికారి తెలిపారు. సహాయక క్యాంపుల ద్వారా ఆహారం తదితర వస్తు సామగ్రిని అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని తెలిపారు. కాగా రాబోయే రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.