న్యూఢిల్లీ: భారీ స్థాయిలో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకునే దిశగా పాకిస్తాన్ చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్లో భారత దేశ సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ వెంట మోహరించే లక్ష్యంతో యుద్ధ ట్యాంకులు, ఆధునిక తుపాకీలను పలు విదేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. రష్యా నుంచి టీ–90లు సహా దాదాపు 600 యుద్ధ ట్యాంకులను సమకూర్చుకుంటోంది. వీటిలో 3 కిమీల నుంచి 4 కిమీల దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగల అత్యాధునిక కంప్యూటరైజ్డ్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థ ఉంది.
విదేశీ కొనుగోళ్లే కాకుండా, 2025 నాటికి దాదాపు 220 ట్యాంకులను చైనా సహకారంతో దేశీయంగా ఉత్పత్తి చేసుకోవాలని పాక్ నిర్ణయించింది. చైనా నుంచి వీటీ–4, ఉక్రెయిన్ నుంచి అప్లాడ్–పీ ట్యాంకులనూ కొనుగోలు చేస్తోంది. 150ఎంఎం ఎస్పీ మైక్–10 ఆధునిక తుపాకులను సైతం సమకూర్చుకుంటోంది. ఇటలీ నుంచి 245 ఈ తరహా తుపాకులను పాక్ కొనుగోలు చేస్తోంది. పాక్ క్షిపణి వ్యవస్థలను సైతం బలోపేతం చేసుకుంటోంది. విధానపరమైన జాప్యం కారణంగా ఆయుధ సంపత్తి పెంచుకునే విషయంలో భారత్ నత్త నడకన నడుస్తోందనే విమర్శలున్నాయి. అయితే, ఇప్పటికైతే, టీ–90, టీ–72, అర్జున యుద్ధ ట్యాంకులతో భారత్ పాక్ కన్నా బలంగానే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment