భారత్ రెడీగా ఉంది: ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో కల్లోల పరిస్థితులకు పాక్ కారణమని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ద్వారా కశ్మీర్ యువతను పాక్ రెచ్చగొడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. కశ్మీర్‌లో పరిస్థితులు త్వరలోనే చక్కబడుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గురువారం మీడియాతో మాట్లాడిన రావత్.. భారత్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆర్మీ ఆధునికీకరణ అంశాన్ని ప్రభుత్వంతో ప్రస్తావిస్తున్నామని, ఈ విషయంలో పురోగతి బాగుందని ఆయన వెల్లడించారు. పాక్, చైనా, కశ్మీర్ కల్లోల పరిస్థితులను ఉటంకిస్తూ రెండున్నర యుద్దాలను ఎదుర్కోవడానికి భారత్ సన్నద్ధంగా ఉందని రావత్ వ్యాఖ్యానించారు.
కాగా.. కశ్మీర్‌లోని నౌగామ్ సెక‍్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని గురువారం భారత ఆర్మీ తిప్పికొట్టింది. చొరబాటుదారులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు.