ఆ పరిశోధకుడిది ఆత్మహత్యే..!
ఇటీవల అనుమానాస్పద స్థితిలో చనిపోయిన పారానార్మల్ సొసైటీ స్థాపకుడు గౌరవ్ తివారీ ది ఆత్మహత్యేనని పోలీసులు తేల్చి చెప్పారు. అతడు తన ఇంట్లోని బాత్రూమ్ లో స్వయంగానే ఉరి వేసుకున్నాడని, అది ఆత్మహత్యేనని ప్రాథమిక శవపరీక్ష నివేదిక ఆధారంగా తేలినట్లు తెలిపారు. అతడి మరణం వెనుక ఏదైనా కుట్ర జరిగిందా అన్న కోణంలో విచారించిన పోలీసులు... అతడు ఆత్మహత్య చేసుకున్న సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నన్లు చెప్పారు.
భారత్ లో ప్రేతాత్మల పరిశోధకుడిగా గుర్తింపు పొందిన గౌరవ్ తివారీ ఢిల్లీలోని తన ఫ్లాట్ లో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. 2009 లో ప్రారంభమైన ఇండియన్ పారా నార్మల్ సొసైటీ సీఈవో గౌరవ్ తివారీ.. సొసైటీ తరపున మూఢనమ్మకాలు, ప్రేతాతమ్మల భయంతో బాధపడే వారికి అవగాహన కల్పించి, వారిలోని భయాలను పోగెట్టేవాడు. 32 ఏళ్ళ తివారీకి తల్లిదండ్రులు, భార్య ఉన్నారు. అయితే అనుమానాస్పద స్థితిలో చనిపోయిన గౌరవ్ ది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారించారు. చివరికి ప్రాథమిక శవపరీక్ష నివేదికల ఆధారంగా ఆత్మహత్యేనని ధృవీకరించారు. అతడి మరణం వెనుక ఎటువంటి కుట్ర జరగలేదని తెలిపారు.
గౌరవ్ బాత్రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి భార్య సహా తల్లిదండ్రులు తెలిపారని, ఓ గుడ్డతో ద్వారకా ఫ్లాట్ లోని బాత్రూమ్ లో ఇంట్లో అందరూ ఉన్న సమయంలోనే ఉరి వేసుకున్నట్లు తెలిపారని ఓ పోలీస్ సీనియర్ అధికారి వెల్లడించారు. తివారీ తరచుగా రాత్రి సమయంలో పని చేసే వాడని, సంపాదన కూడా పెద్దగా లేదని తెలిపిన కుటుంబ సభ్యులు అతడు చేపట్టిన కార్యకలాపాలపై ఏమాత్రం సంతోషంగా లేనట్లు విచారణలో తెలిసిందని ఓ పోలీసు అధికారి తెలిపారు.