తల్లిదండ్రులకు ఇక భయం లేదు..!
పిల్లలు స్కూలుకు వెళ్ళి ఇంటికి చేరే వరకూ కాస్త ఆలస్యం అయితే చాలు ఎక్కడ ఉన్నారో నని తల్లిదండ్రులు తెగ భయపడిపోతుంటారు. టైం దాటిన తర్వాత స్కూలుకు ఫోన్ చేసినా ఉపయోగం ఉండదు. బస్సులో బయల్దేరిన పిల్లలు ఇప్పటిదాకా రాకపోవడమేమిటి అంటూ కంగారు పడిపోతారు. అటువంటి భయం అక్కర్లేకుండా పిల్లల జాడ సులభంగా తెలుసుకునేందుకు ఓ పదోక్లాస్ విద్యార్థి కొత్త యాప్ ను కనుగొన్నాడు. స్కూల్ బస్ ట్రాఫిక్ లో ఇరుక్కున్నా... ఇంకేమైనా అవాంతరాలు వచ్చినా పేరెంట్స్ భయపడాల్సిన అవసరం లేదంటున్నాడు.
చెన్నై వెలమ్మల్ విద్యాశ్రమ్ స్కూల్లో పదోతరగతి చదువుతున్న పదిహేనేళ్ళ ఎస్. అర్జున్... కొత్త యాప్ ను సృష్టించాడు. 2012 లో చైన్నైలో తుఫాన్ వచ్చిన సమయంలో అర్జున్ కు ఈ కొత్త ఐడియా వచ్చింది. స్కూల్ బస్ ఆలస్యం కావడంతో ఇంటికి లేటుగా వచ్చిన అర్జున్ కు తల్లిదండ్రుల కంగారు చూసి బాధేసింది. అప్పుడే మెదడులో వచ్చిన ఆలోచనతో అటుదిశగా అడుగులు వేయడం ప్రారంభించాడు. యాప్ ను సృష్టించడం, యాండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ వంటివి నేర్చుకోవడం మొదలు పెట్టాడు. టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టం ఉండటంతో తాను అనుకున్న పని సాధించగలిగాడు. స్వంతంగా లొకేటరా(LOCATERA) పేరున ఓ కొత్త యాప్ ను సృష్టించాడు. అర్జున్ తండ్రికి ఇంట్లో కంప్యూటర్ ఉండటంతో రెండేళ్ళ వయసునుంచే దానిపై అర్జున్ ఎంతో ఇష్టం చూపించేవాడు. అతడి ఇష్టాన్ని గమనించిన తల్లిదండ్రులు వయసుకు తగ్గట్టుగా కంప్యూటర్ టెక్నాలజీ గురించీ నేర్పిస్తూ వచ్చారు.
ఈ జెడ్ స్కూల్ బస్ లొకేటర్ (Ez school bus locator) పేరున అర్జున్ మొదటిసారి ఓ యాప్ ను రూపొందించాడు. ఇందులో తన స్కూల్ తో పాటు స్థానికంగా ఉన్న మరిన్ని స్కూళ్ళ వివరాలను కూడ పొందుపరిచాడు. మెల్లమెల్లగా విద్యార్థులు, తల్లిదండ్రుల వివరాలతోపాటు, స్కూళ్ళ యాజమాన్యాలు, సిబ్బంది వివరాలను అందులో చేరుస్తూ ప్రస్తుతం లొకేటరా పేరున మాడిఫైడ్ వర్షన్ ను అందుబాటులోకి తెచ్చాడు. మిగిలిన యాప్ లకు భిన్నంగా ఈ యాప్ కోసం కొంత హార్డ్ వేర్ ను కూడ ఉపయోగించాడు. స్కూల్ బస్ లో హార్డ్ వేర్ ను ఇన్ స్టాల్ చేసి... తల్లిదండ్రులకు బస్ గమనం తెలిసేలా చేశాడు. ఈజెడ్ స్కూల్ బస్ లొకేటర్ ఉచిత వెర్షన్ ను ఇప్పటికే పది దేశాల్లో వాడకంలోకి తెచ్చారు. ఇండియాలో కూడ ఈ యాప్ త్వరలో పూర్తిశాతం వినియోగంలోకి రాగలదని అర్జున్ తండ్రి సంతోష్ కుమార్ ఆశిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి సంవత్సరం పాటు ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన యాప్ కు అనంతరం నెలవారీ ఫీజును వసూలు చేసేట్టుగా నిర్ణయించారు. కొత్త యాప్ ను ప్రస్తుతం తన స్కూల్లో అందుబాటులోకి తెచ్చిన అర్జున్ త్వరలో నగరంలోని అన్ని స్కూళ్ళలో పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు.
అర్జున్ రూపొందించిన యాప్ లో మూడు యాప్ లు ఒకేసారి పనిచేస్తుంటాయి. అడ్మిన్, అటెండెంట్, పేరెంట్ యాప్ లను కలిపి ఈ లొకేటరాను తయారు చేశాడు. విద్యార్థులతోపాటు, స్కూల్ సిబ్బంది, బస్ డ్రైవర్ కూడ వారికి సంబంధించిన బార్ కోడ్లతో వారి వారి ఫోన్లలో స్కాన్ చేసుకోవడంతో సమాచారం తెలిసే వీలుంటుంది. అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులతోపాటు, స్కూల్ యాజమాన్యం, డ్రైవర్ కూడ ఈ యాప్ ను వినియోగించుకొని బస్ జాడ తెలుసుకునే అవకాశం ఉంటుంది. యాప్ ను తయారు చేసేందుకు అర్జున్.. ఎంఐటి ప్రోగ్రామింగ్ టూల్ ను వినియోగించాడు. గూగుల్ ఇండియా కోడ్ టు లెర్న్ కాంటెస్ట్ 2015 లో పాల్గొని గెలుపొందాడు. అలాగే ఎంఐటి యాప్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడ గెలుచుకున్నాడు. కంప్యూటర్ టెక్నాలజీలో ప్రత్యేకతలు కలిగిన పిల్లలకు భారత ప్రభుత్వ ఉమెన్ అండ్ ఛైల్డ్ డెవలప్మెంట్ శాఖ ప్రత్యేకంగా ఇచ్చే.. 2014 నేషనల్ ఛైల్డ్ అవార్డును సాధించాడు. తమ ప్రతిభను వినియోగించి ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు అర్జున్ సూచిస్తున్నాడు.