పద్మ అవార్డుల్లో పక్షపాతం ఎక్కువే
వివిధ రంగాల్లో విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రతి ఏటా పౌరులకు ఇచ్చే పద్మ అవార్డులను అందజేయడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందా? 1954లో ఏర్పాటుచేసిన భారతరత్న, పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ఇప్పటివరకు అందుకున్న వారి వివరాలను విశ్లేషిస్తే అవుననే సమాధానం వస్తోంది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 4,329 అవార్డులను కేంద్రం అందజేయగా, 797 అవార్డులతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 756 అవార్డులతో మహారాష్ట్ర, 391 అవార్డులతో తమిళనాడు, 295 అవార్డులతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ సహా ఈ నాలుగు రాష్ట్రాలే మొత్తం అందజేసిన అవార్డుల్లో 50 శాతానికి పైగా అందుకున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లకు జనాభా ప్రాతిపదికన ఎక్కువ అవార్డులు వచ్చాయని సమర్థిస్తున్న వారు కూడా ఉన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం పది లక్షల మందికి ఒక అవార్డు రావాలని చూసుకుంటే.. అవార్డులు అందుకున్న జాతీయ సగటు శాతం 3.58కాగా, 47.57 శాతంతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర 6.73 శాతంతో రెండో స్థానంలో ఉండగా, తమిళనాడు 5.42 శాతంతో మూడోస్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్‌కు అతి తక్కువగా 1.48 శాతం అవార్డులే దక్కాయి. ఈ లెక్కల ప్రకారం చూసినా జనాభాకు, అవార్డులకు ఎలాంటి లింకు లేదని స్పష్టమవుతోంది. అసలు లింకంతా కేంద్ర ప్రభుత్వంలోనే ఉంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే పద్మ అవార్డులకు ఆనవాయితీగా పేర్లను సిఫార్సు చేస్తున్నా, కేంద్రానికి దగ్గరగా ఉన్నవారినే ఎక్కువగా ఎంపిక చేస్తున్నారనే విషయం స్పష్టం అవుతుంది.
ప్రధానమంత్రి నాయకత్వంలోని అవార్డుల కమిటీయే ప్రతి ఏటా అవార్డు గ్రహీతలను ఎంపిక చేస్తున్నా.. వారి ప్రాధాన్యతలు అవార్డుల ఎంపికపై ప్రభావం చూపిస్తుందన్న విషయంలో సందేహం లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలతో సిఫార్సు చేయించుకునేందుకు ఎంతో మంది ప్రభుత్వ పెద్దలతో లాబీలు నడపడం కూడా మనకు తెల్సిందే. ఈసారి అలా జరగకూడదనే ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పద్మ అవార్డుల కోసం నేరుగా ప్రజల నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరింది. ఇప్పటికే 1700 దరఖాస్తులు సంబంధిత కేంద్ర విభాగానికి చేరాయని తెల్సింది. ఈసారయినా అవార్డు గ్రహీతల ఎంపికలో పారదర్శకత, ప్రమాణికత ఉంటుందో, లేదో చూడాలి.