
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఓ యువకుడు తుపాకీతో కనిపించి కలకలం రేపాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తనిఖీలు చేసే సందర్భంలో అతడు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఢిల్లీలోని రద్దీగా ఉండే నెహ్రూ ప్లేస్‌లో మెట్రో రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ మెటల్ డిటెక్టర్ వద్ద మెట్రోలో ప్రయాణించే వాళ్లను తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందం ఉంది.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు చెక్ చేస్తుండగా వారిలో 21 ఏళ్ల సుమిత్ మిశ్రా యువకుడు కంగారుగా కనిపించాడు. దాంతో అతడిని ప్రత్యేకంగా తనిఖీ చేయగా తుపాకీ లభ్యం అయింది. దీంతో వెంటనే అధికారులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ యువకుడు ఎవరు, అతడి చేతుల్లోకి తుపాకీ ఎలా వచ్చింది? ఎందుకు అతడు తుపాకీతో మెట్రో స్టేషన్‌కు వచ్చాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది.