
రాంచీ: తమకు ఎలాంటి వధువు, వరుడు కావాలో వివరిస్తూ వార్తా పత్రికల్లో, వెబ్‌సైట్లలో, మ్యారేజ్ బ్యూరోల్లో అనేక ప్రకటనలు వస్తుంటాయి. వాటిని మనం పరిశీలిస్తే.. అందంగా ఉండాలని, డబ్బుండాలని, ఉద్యోగం ఉండాలని కొందరు, పెళ్లయితే ఉద్యోగం మానేయాలని మరికొందరు.. ఇలా అనేక షరతులు కూడా పెడుతుంటారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఏవైనా తక్కువయ్యాయా అన్నట్లుగా.. ఆ కొరత తీర్చడానికి ఓ బ్రాహ్మణ యువకుడు వింత కోరికలతో ఓ వినూత్న ప్రకటన ఇచ్చాడు.
జార్ఖండ్‌కు చెందిన డాక్టర్ అభినవ్ కుమార్ అనే యువకుడు వధువు కోసం ఇచ్చిన ప్రకటన ఆసక్తి రేపుతోంది. తన జీవితంలోకి రాబోయే వధువు అందంగా ఉంటూ నమ్మకమైన బ్రాహ్మణ వధువు కావాలని.. ఆమెలో అతివాద లక్షణాలున్నా అభ్యంతరం లేదని అంటున్నాడు. ఇవి మాత్రమే కాకుండా ఆమె ధనవంతురాలు, దేశభక్తురాలై ఉండాలని నిబంధనలు పెట్టాడు. ‘ఆమెకు మనదేశ సైనిక, క్రీడా సామర్థ్యాలను పెంచాలన్న కోరిక ఉండాలి. వంట కూడా బాగా వచ్చి ఉండాలి. పిల్లను పెంచడంలో నైపుణ్యం ఉండాలి, ఉద్యోగం చేస్తుండాలి' అని డిమాండ్లు పెట్టారు. ఇన్ని గుణాలున్న యువతి అసలు భూమి మీద ఉంటుందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అతనిది అత్యాశ అని.. పురుషాధిపత్యానికి అద్దం పట్టేలా ఈ ప్రకటన ఉందంటూ అతడిని విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment