
పట్రోల్‌పై 75 పైసలు తగ్గింపు
పెట్రోల్ ధర స్వల్పంగా లీటరుకు 75 పైసలు తగ్గింది. తగ్గింపు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. స్థానిక పన్నులు కూడా తగ్గనుండడంతో ధరలు ప్రాంతాలను బట్టి మరికొంత తగ్గుతాయి.
న్యూఢిల్లీ: పెట్రోల్ ధర స్వల్పంగా లీటరుకు 75 పైసలు తగ్గింది. తగ్గింపు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. స్థానిక పన్నులు కూడా తగ్గనుండడంతో ధరలు ప్రాంతాలను బట్టి మరికొంత తగ్గుతాయి. పెట్రోల్ ధర తగ్గడం గత ఐదు నెలల్లో ఇదే తొలిసారి. గత ఏడాది నవంబర్‌లో చివరిసారిగా రూ.1.15 తగ్గించారు. తాజా తగ్గింపుతో ఢిల్లీలో లీటరు ధర రూ. 73.16 నుంచి 90 పైసలు తగ్గి రూ. 72.26కు చేరుతుంది. కాగా, నెలనెలా డీజిల్‌పై వడ్డిస్తున్న 50 పైసల పెంపును ఎన్నికల నేపథ్యంలో పక్కన పెట్టారు.
అంతర్జాతీయ చమురు మార్కెట్లో ధరలు తగ్గడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడడంతో పెట్రోల్ ధర తగ్గించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) తెలిపింది. ఈ రెండు కారణాలతో లీటర్ డీజిల్ అమ్మకంపై కంపెనీలకు వస్తున్న నష్టం ప్రతిపాదిత ప్రభుత్వ సబ్సిడీ కంటే తగ్గడంతో ధర పెంచలేదు. ‘ప్రస్తుతం లీటర్ డీజిల్ అమ్మకంపై రూ.5.93 నష్టం వస్తోంది. ఈ మొత్తం డాక్టర్ కిరీట్ పారిఖ్ కమిటీ సిఫార్సు చేసిన రూ.6 సబ్సిడీకంటే తక్కువ . దీంతో నెలవారీ ధర పెంపును ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. ప్రభుత్వ సలహా అందాక ధర సవరణపై నిర్ణయం తీసుకుంటాం’ అని ఐఓసీ తెలిపింది.