న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ ఉపాధ్యాయులు, వర్సిటీల ప్రొఫెసర్లు, ఉద్యోగులకు కేంద్రం దీపావళి బొనాంజా ప్రకటించింది. ఏడవ వేతన సవరణ కమిషన్ సిఫారసులను అమలుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం ద్వారా యూజీసీ నిధులతో నడిచే 106 యూనివర్సిటీలు, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడిచే 329 యూనివర్సిటీలు, వర్సిటీలకు అనుబంధంగా ఉన్న 12,912 ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లోని 7.58 లక్షల మంది టీచర్లు, ప్రొఫెసర్లు, బోధన సిబ్బందికి లబ్ధి చేకూరనుందని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. వీరితోపాటుగా 119 కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎస్‌సీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐటీఐఈల్లోని ఉపాధ్యాయులకూ వేతనాలు పెరుగుతాయని తెలిపారు.
‘ఈ వేతన సవరణ అమలు వల్ల ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, అకడమిక్ ఉద్యోగుల వేతనాల్లో రూ.10,400 నుంచి రూ. 49,800 వరకు పెంపుదల ఉంటుంది. అంటే 22 నుంచి 28 శాతం వరకు వేతన పెంపు ఉంటుంది’ అని మంత్రి పేర్కొన్నారు. వేతన సవరణలో మార్పుల ద్వారా ఉన్నతవిద్యలో నాణ్యత, నైపుణ్యం పెరుగుతాయని భావిస్తున్నామన్నారు.
2016 జనవరి 1 నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడిచే విద్యాసంస్థల్లో వేతన సవరణ మార్పులకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం అవసరం. అయితే.. మార్చిన తర్వాత పెరిగే వేతనాల భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,800 కోట్ల భారం పడనుంది.
మరిన్ని కేబినెట్ నిర్ణయాలు
► రూ.6,655 కోట్ల ప్రపంచబ్యాంకు ఆర్థికసాయంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో వ్యవస్థాగత సంస్కరణలు తీసుకొచ్చే సంకల్ప్ (స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్‌నెస్ ఫర్ లైవ్‌లీహుడ్ ప్రమోషన్), స్ట్రైవ్ (స్కిల్ స్ట్రెంతెనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్‌హాన్స్‌మెంట్) పథకాలకు ఆమోదం
► వచ్చే మూడునుంచి ఐదేళ్లలో 3లక్షల మంది భారత యువతను ఉద్యోగ శిక్షణ కోసం జపాన్‌కు పంపాలన్న ప్రతిపాదనకు అంగీకారం. ఇందుకు అవసరమైన ఖర్చులను జపాన్ భరిస్తుంది.
► ప్రభుత్వేతర సంస్థగా ఉన్న అంతర్జాతీయ సముద్రయాన విభాగం ఐఏఎల్‌ఏను ప్రభుత్వ సంస్థగా (వివిధదేశాల మధ్య సముద్ర బంధాలు పెరిగేలా) మార్చాలన్న ప్రతిపాదనకూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
► ఒకేషనల్ విద్య, శిక్షణ నిమిత్తం భారత్–బెలారస్ మధ్య జరిగిన ఒప్పందానికి అంగీకారం.
Comments
Please login to add a commentAdd a comment