
పీటర్ ఇంట్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
ముంబై: షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా భర్త, స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియాను పోలీసులు ఈరోజు మళ్లీ విచారణ చేయనున్నారు. పీటర్ స్వగృహంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు కొన్ని డాక్యుమెంట్లను, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి చేపట్టిన దర్యాప్తు, విచారణలో భాగంగా నిన్న ఆయనను 12 గంటల పాటు ప్రశ్నించి, కొన్ని విషయాలను రాబట్టుకున్నారు. కలినాలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో ఈ కేసుకు సంబంధించి లభ్యమైన ఆధారాలను వారు పరిశీలిస్తున్నారు. కుళ్లిపోయిన మృతదేహాం నుంచి కొన్ని శాంపిల్స్,ఇంద్రాణి నుంచి కొన్ని శాంపిల్స్ ను సేకరించారు.
ఖేర్ పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా పోలీసులు ఆయనకు సమాచారమిచ్చారు. ఆయన స్టేట్మెంట్ నోట్ చేసుకుంటామని ముంబై పోలీసులు తెలిపారు. కూతుర్ని హత్య చేసిందన్న ఆరోపణలతో ఇంద్రాణీ ముఖర్జియా ఆగస్టు 25న అరెస్టయిన విషయం విదితమే. ఇంద్రాణీ, పీటర్ లకు ఒకే విధమైన ప్రశ్నలను ఇచ్చి సమాధానమివ్వాలని కోరారు. ఆర్థిక సంబంధమైన విషయాలు.. వివిధ కంపెనీలలో వాటా, షేర్ల వివరాలపై ఎక్కువగా ప్రశ్నలు ఉన్నట్లు తెలుస్తోంది. భార్య ఇంద్రాణీకి, కుమారుడు రాహుల్, షీనాబోరా, మరో కూతురు వైదేహిలకు నగదు ఎంత మొత్తం ఇచ్చేవారో తెలపాలని అధికారులు ఆయనను ప్రశ్నించారు.