ప్రారంభమైన అపెక్స్ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ : కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి అధ్యక్షతన అపెక్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న వివాదాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. శ్రమశక్తి భవన్‌లోని ఉమాభారతి చాంబర్‌లో ఈ భేటీ జరుగుతోంది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల కింద తమకు దక్కే వాటాలపై గళమెత్తేందుకు ఇటు తెలంగాణ.. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై నిలదీసేందుకు అటు ఏపీ సిద్ధమయ్యాయి.
ఇది ఎజెండా:
అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో కేంద్రం ఐదు ప్రధాన అంశాలను చేర్చింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ నరేశ్‌కుమార్ ఇరు రాష్ట్రాలకు సమాచారం పంపారు. 21వ తేదీ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు శ్రమశక్తి భవన్‌లోని కేంద్రమంత్రి ఉమాభారతి చాంబర్‌లో సమావేశం జరుగుతుందని వివరించారు. ఎజెండాలోని అంశాలను నోటీస్‌లో వివరించారు. సుప్రీంకోర్టు పరిష్కరించాలని సూచించిన పాలమూరు, డిండి ప్రాజెక్టులను తొలి అంశంగా చేర్చారు.
ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి తాత్కాలిక విధానం, రిజర్వాయర్ల పరిధిలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో లెక్కలు పారదర్శకంగా ఉండేందుకు టెలీమెట్రీ విధానం, ఒక వాటర్ ఇయర్‌లో నీటి వాటాల్లో హెచ్చుతగ్గులుంటే వాటి సర్దుబాటు, గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీటి తరలిస్తూ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను ఎజెండాలో చేర్చారు.
వీటితో పాటు ఏవైనా ఇతర అంశాలుంటే కేంద్రమంత్రి సమ్మతితో చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఒక్కో రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇంజనీర్ ఇన్ చీఫ్‌తో కూడిన ఐదుగురు ప్రతినిధుల బృందం హాజరు కావాలని సూచించారు.