రెండు గంటలు ఆకాశంలో విమానం చక్కర్లు
Published Tue, Jun 28 2016 11:26 PM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM
చెన్నై: సాంకేతిక లోపం కారణంగా విమానం సుమారు రెండు గంటల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయం నుంచి సోమవారం సాయంత్రం 5.20 గంటలకు ఎయిర్ ఏషియా విమానం కౌలాలంపూర్‌కు బయలుదేరింది. అందులో 151 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ తీసుకోగానే ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. పైలట్ తిరుచ్చి విమానాశ్రయ అధికారులకు వెంటనే సమాచారం అందించారు.
విమానంలో ఉన్న ఇంధనం స్థాయి తగ్గేవరకు తిరుచ్చి చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందిగా అధికారులు సూచించారు. దీంతో రెండు గంటలపాటు విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ప్రయాణికులు ఏం జరుగుతుందోనన్న భయంతో సీట్లలోనే కూర్చుండిపోయారు. రాత్రి 7.15 గంటలకు విమానంలో పెట్రోల్ స్థాయి తగ్గడంతో విమానాన్ని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో భద్రంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement
Advertisement