విమానానికి తప్పిన పెద్ద ప్రమాదం
న్యూఢిల్లీ: స్పైస్ జెట్ విమానానికి మంగళవారం సాయంత్రం పెద్ద ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి 211 మందితో బయలుదేరిన విమానం కోల్ కతా విమానాశ్రయంలో దిగగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టేకాఫ్ అయిన తర్వాత విమానం టైరు ఊడిపోయినట్టు గుర్తించిన రన్ వే సిబ్బంది వెంటనే ఏసీటీకీ సమాచారం అందించారు.
రన్ వేపై లభ్యమైన టైరు శకలాలు స్పైస్ జెట్ విమానానికి చెందినవేనని నిర్ధారించుకున్న తర్వాత పైలట్ కు ఏసీటీ సమాచారం అందించింది. దీంతో విమానం భద్రతపై ఆందోళన మొదలైంది. ముందు జాగ్రత్తగా విమానాన్ని కోల్ కతా ఎయిర్ పోర్టులో దించేశారు. విమానాన్ని పైలట్ సురక్షితంగా కిందకు దించడంతో ఉత్కంఠకు తెరపడింది.
ల్యాండ్ అయిన వెంటనే విమానంలోని వారందరినీ కిందకు దించేశారు. విమానంలోని వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. టైరు ఊడిపోయిందా, పేలిందా అన్నది విచారణలో తేలనుంది. దీనిపై పౌరవిమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ అధిపతి ఎం సాధి విచారణకు ఆదేశించారు.