
మదన్ లాల్ ఖురానా మృతికి ప్రధాని సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ మాజీ సీఎం మదన్ లాల్ ఖురానా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుదీర్ఘ అస్వస్థత అనంతరం శనివారం రాత్రి ఖురానా మరణించారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఢిల్లీలో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు మదన్ లాల్ ఖురానా తీవ్రంగా కృషిచేశారని, ప్రజల సంక్షేమం కోసం నిత్యం పరితపించేవారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఢిల్లీలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని, ఈ విషాద వేళ ఆయన కుటుంబ సభ్యులను వెన్నంటి ఉంటామన్నారు. మదన్ లాల్ ఖురానా ఆదర్శ స్వయంసేవకుడిగా గుర్తింపు పొందారని, జన్‌సంఘ్, బీజేపీ వ్యవస్ధాపక సభ్యుల్లో ముఖ్యులని బీజేపీ చీఫ్ అమిత్ షా ట్వీట్ చేశారు. ఖురానా మృతికి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్, స్మృతీ ఇరానీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.