కలల ‘బుల్లెట్‌’ కు ముందడుగు.. | PM Modi and Japanese PM Abe lay foundation stone for India's first bullet train project | Sakshi
Sakshi News home page

కలల ‘బుల్లెట్‌’ కు ముందడుగు..

Published Fri, Sep 15 2017 1:36 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

కలల ‘బుల్లెట్‌’ కు ముందడుగు.. - Sakshi

కలల ‘బుల్లెట్‌’ కు ముందడుగు..

అహ్మదాబాద్‌లో శంకుస్థాపన చేసిన భారత్, జపాన్‌ ప్రధానులు
భారత్‌కు జపాన్‌ ఇచ్చిన పెద్ద కానుకన్న ప్రధాని మోదీ
ఇరుదేశాల సంబంధాల్లో కొత్తశకం ప్రారంభం: షింజో అబే
వాణిజ్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలు సహా 15 ఒప్పందాలపై సంతకాలు


అహ్మదాబాద్‌/గాంధీనగర్‌: భారత్‌–జపాన్‌ సంబంధాల్లో మరో కీలక ముందడుగు పడింది. జపాన్‌ ఆర్థిక సాయంతో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు గురువారం అహ్మదాబాద్‌లో శంకుస్థాపన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే సంయుక్తంగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

అనంతరం సబర్మతిలోని అథ్లెటిక్స్‌స్టేడియంలో జరిగిన కార్యక్రమం సభలో మోదీ మాట్లాడుతూ.. రూ.1.1 లక్షల కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ‘భారత్‌కు జపాన్‌ ఇచ్చిన పెద్ద కానుక’ అని మోదీ వ్యాఖ్యానించారు. భారత కలల ప్రాజెక్టుకు ముందడుగు పడిందన్నారు.

‘భారత–జపాన్‌ భాగస్వామ్యం ప్రత్యేకం, వ్యూహాత్మకం, అంతర్జాతీయం’అని అబే పేర్కొన్నారు.ఆ తర్వాత గాంధీనగర్‌లో జరిగిన భారత్‌–జపాన్‌ వార్షిక సదస్సులో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను పెంచేలా భద్రతతోపాటు పలు రంగాల్లోనూ కీలక ఒప్పందాలు జరిగాయి. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా ఇరువురు నేతలు చర్చించారు.  ఉగ్రసాయం మానుకోవాలని పరోక్షంగా పాక్‌ను హెచ్చరించారు.

భారత్‌–జపాన్‌.. ఒకరికొకరు!
‘పటిష్ఠ భారత్‌ కావాలని జపాన్‌.. జపాన్‌ బలోపేతాన్ని భారత్‌ కోరుకుంటున్నాయ’ని అబే వ్యాఖ్యానించారు. ‘నా మిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘదృష్టి గల నేత. నవభారత నిర్మాణానికి ఆయన సంకల్పించారు. అందులో భాగంగా రెండేళ్ల క్రితమే హైస్పీడ్‌ రైళ్లను తీసుకురావాలని ఆయన భావించారు. కొన్నేళ్లలోనే బుల్లెట్‌ రైలు కిటికీ నుంచి అందమైన భారతాన్ని దర్శిస్తాం’ అని అబే పేర్కొన్నారు. దేశంలో బుల్లెట్‌ రైలుండాలన్న భారత్‌ కలను సాకారంచేసే దిశగా ధైర్యంగా తొలి అడుగు ముందుకు పడిందని మోదీ తెలిపారు.

ఈ ప్రాజెక్టు కోసం రూ.88వేల కోట్ల రూపాయలను నామమాత్రమైన 0.1శాతం వడ్డీకే ఇచ్చినందుకు జపాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను బుల్లెట్‌ రైలు గురించి మాట్లాడితే.. పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఇప్పుడు దీనికి పనులు మొదలవుతుంటే.. ఇప్పుడు ఈ రైలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. వేగవంతమైన అనుసంధానత కారణంగా సమయం తగ్గుతుంది తద్వారా ఆర్థిక ప్రగతికి మార్గం పడుతుంది’ అని మోదీ పేర్కొన్నారు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు శిక్షణ కోసం వడోదరలో జపాన్‌ సాయంతో ఏర్పాటుచేయనున్న ఇన్‌స్టిట్యూట్‌లో 4వేల మందికి శిక్షణనివ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్, గుజరాత్, మహారాష్ట్ర సీఎంలు విజయ్‌ రూపానీ, ఫడ్నవిస్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆప్ను అహ్మదాబాద్‌ – ఆంచీ ముంబై!
బుల్లెట్‌ రైలు ద్వారా అహ్మదాబాద్, ముంబై నగరాల మధ్య ప్రయాణ సమయంతోపాటుగా ప్రజల మధ్య దూరం కూడా తగ్గుతుందని మోదీ పేర్కొన్నారు. గుజరాతీ, మరాఠీ పదాలను ఉపయోగిస్తూ.. ‘ఆప్ను అహ్మదాబాద్‌ నుంచి ఆంచీ ముంబై’ మధ్య నడిచే రైలు వల్ల ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్నారు. ‘భారతీయులం, మరీ ముఖ్యంగా గుజరాతీలం ఏది కొనాలన్నా, అమ్మాలన్నా గీచి గీచి బేరమాడతాం.

చిన్న బండి కొనుక్కునేందుకు పది బ్యాంకులు తిరిగి ఎవరు తక్కువ వడ్డీకి రుణమిస్తారో వెతుకుతాం. ఇప్పుడు జపాన్‌ కూడా రూ.1.1 లక్షల కోట్ల ప్రాజెక్టుకు కేవలం 0.1 శాతం వడ్డీకే రుణమిచ్చింది’ అని మోదీ పేర్కొన్నారు. జపాన్‌లో తొలి రెండక్షరాలు (ఇంగ్లీషులో) జే,ఏ ఇండియాలో తొలి అక్షరం ఐ కలిస్తే ‘జై’ అవుతుందన్న అబే.. ‘జై జపాన్, జై ఇండియా’ అనే నినాదాన్ని తీసుకొచ్చారు. ఈ నినాదం కోసం మోదీతో కలిసి పనిచేస్తానని ఆయన తెలిపారు.  అనంతరం గాంధీనగర్‌లోని దండి కుటీర్‌ మ్యూజియంను అబేకు దగ్గరుండి మోదీ చూపించారు.

వ్యూహాత్మక బంధాల బలోపేతం
అనంతరం, గాంధీనగర్‌లో భారత్‌–జపాన్‌ వార్షిక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మోదీ–అబే మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయాంశాలపై చర్చలు జరిగాయి. రక్షణ, వాణిజ్యం, పౌరఅణు శక్తి రంగాల్లో సహకారాన్ని పెంచుకునే దిశగా వీరిద్దరూ చర్చలు జరిపారు. దీంతోపాటుగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునే దిశగా పౌర విమానయానం, వాణిజ్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించి 15 ఒప్పందాలు జరిగాయి.

చైనా దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు కూడా అంగీకారం కుదిరింది. అనంతరం ఇరువురు నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘సంయుక్త ప్రకటనపై సంతకం చేయటం ద్వారా.. భారత–జపాన్‌ సంబంధాల్లో కొత్త శకం ప్రారంభం కానుంది. దీని ఆధారంగా ఇండో–పసిఫిక్‌ ప్రాంతంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా శాంతినెలకొల్పేలా.. ఇరుదేశాల ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మేం బలంగా ముందుకు తీసుకెళ్తాం’ అని అబే తెలిపారు.

ఇరుదేశాలు ‘భారత్‌–జపాన్‌ పెట్టుబడుల రోడ్‌ మ్యాప్‌’కు అంగీకరించాయన్నారు. పౌర అణు ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ.. క్లీన్‌ ఎనర్జీ రంగంలో ఇరుదేశాల మధ్య కొత్త అధ్యాయం మొదలైందని అబే తెలిపారు. అణుశక్తిని శాంతియుత అవసరాలకు వినియోగించుకునేలా చరిత్రాత్మక ఒప్పందంపై గతేడాది తన జపాన్‌ పర్యటన సందర్భంగా సంతకం చేసినట్లు మోదీ పేర్కొన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో జపాన్‌ 4.7 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.30వేల కోట్లు) పెట్టుబడులు పెట్టిందని.. గతేడాది కన్నా ఇది 80 శాతం ఎక్కువని మోదీ వెల్లడించారు. కాగా జపాన్‌ ప్రధాని అబే అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటే ఆయన భార్య అకీ అబే కూడా బిజీగా గడిపారు. వివిధ పాఠశాలలు, కాలేజీలతోపాటుగా అంధులకోసం నడుస్తున్న ఎన్జీవోను సందర్శించారు.  
 
భూములు తీసుకుంటారనే బాధతో..
బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకోసం భూసేకరణలో తమ వ్యవసాయ భూములు పోతాయేమోనని మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. బోయ్‌సర్‌ రైల్వే స్టేషన్‌ ఎదుట నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టిన రైతులు.. వ్యవసాయ భూములు తీసుకుంటే తమ జీవితాలు దుర్భరమవుతాయని ఆవేదన చెందారు.

గుజరాత్‌ ఎన్నికల కోసమే: కాంగ్రెస్‌
హైస్పీడ్‌  రైలును కాంగ్రెస్‌ పార్టీ ‘గుజరాత్‌ ఎన్నికల బుల్లెట్‌ రైలు’గా అభివర్ణించింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ రైలుకు శంకుస్థాపన చేశారని విమర్శించింది. ప్రయాణికుల భద్రతపై దృష్టిపెట్టాల్సిందిపోయి.. ఎన్నికల కోసం ఈ ప్రాజెక్టును ప్రారంభించారని లోక్‌సభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.  

బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు విశేషాలు
♦   ప్రాజెక్టు ఖర్చు రూ.1.1లక్షల కోట్లు
♦   జపాన్‌ చేస్తున్న సాయం 88వేల కోట్లు (0.1 శాతం వడ్డీపై రుణం)
♦   ముంబై–అహ్మదాబాద్‌ మధ్య 508 కిలోమీటర్లు
♦   గరిష్ట వేగం గంటకు 320 – 350 కిలోమీటర్లు
♦   మొత్తం స్టేషన్లు 12
♦   ప్రయాణ సమయం 12 స్టేషన్లలో ఆగితే 2.58 గంటలు
♦   కొన్ని స్టేషన్లలోనే ఆగితే 2.07 గంటలు
♦  ప్రస్తుత రైల్వే మార్గంలో ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణ సమయం 7–8 గంటలు
♦  2022 ఆగస్టు 15న దీన్ని ప్రారంభించాలని లక్ష్యం.


ఉగ్రసాయంపై..
ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటంలో భారత్‌కు సంపూర్ణ సహకారం ఉంటుందని అబే స్పష్టం చేశారు. అల్‌కాయిదాతోపాటుగా పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలపై పోరాటంలో సహకారానికి మద్దతు తెలిపారు. ముంబై (2008), పఠాన్‌కోట్‌ (2016) ఉగ్రదాడులకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని ఈ సందర్భంగా మోదీ, అబేలు పాకిస్తాన్‌ను కోరారు. ‘ఉగ్రవాద కేంద్రాలు తొలగించటం, వారికి ఎలాంటి వసతులు అందకుండా చేయటం, ఉగ్ర నెట్‌వర్క్‌ల ధ్వంసం, సీమాంతర ఉగ్రవాదం లేకుండా చూడాలని అన్ని దేశాలను మోదీ–అబే కోరారు’ అని సంయుక్త ప్రకటన పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement