
ఔసా(మహారాష్ట్ర)/చిత్రదుర్గ: పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్‌లో ఉగ్రవాదుల పని పట్టిన వీర జవాన్లకు తమ ఓటుహక్కును అంకితం చేయాలని తొలిసారి ఓటేయబోతున్న యువజనులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘మీ తొలి ఓటును వీర జవాన్లకు అంకితమిస్తారా? పుల్వామాలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు అంకితమిస్తారా? ఏ ఎన్నికల్లో ఎవరికి తొలి ఓటు వేశారో ఎన్నటికీ మరచిపోరు’ అని అన్నారు. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని ఔసాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. స్వాతంత్య్రం రావడానికి ముందు కాంగ్రెస్ నేతలు తెలివిగా వ్యవహరిస్తే అసలు పాకిస్తాన్ అనే దేశమే పుట్టేది కాదని అన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని ఉండాలని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు నేషనలిస్ట్ కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్ మద్దతు పలకడం ఎంత వరకు సబబమన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో పాక్ పల్లవి..
కాంగ్రెస్ మేనిఫెస్టో పాకిస్తాన్ భాషలో మాట్లాడుతోందని అన్నారు. ఉగ్రవాదుల సొంత గడ్డకు చొచ్చుకెళ్లి వారిని మట్టుపెట్టడమే బీజేపీ ప్రతిపాదించిన నవ భారత్ విధానమని చెప్పారు. సాయుధ బలగాల అధికారాల్లో కోత విధించాలని కాంగ్రెస్ భావిస్తోందని, పాక్ కూడా ఇదే కావాలని అన్నారు. అలా అయితే భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతిని మాత్రమే నిజాయతీతో చేసిందని చురకలంటించారు. ఇటీవల జరిగిన వరస ఐటీ దాడుల్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ముఖ్యుల ఇళ్ల నుంచే పెట్టెల కొద్దీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయని గుర్తుచేశారు. గత ఆరు నెలలుగా చౌకీదారునే దొంగ అంటున్నారని, కానీ ఈ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు దొంగ ఎవరు? అని ప్రశ్నించారు. చాన్నాళ్ల తరువాత తనతో వేదిక పంచుకున్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తనకు తమ్ముడు లాంటి వారని అన్నారు. భారత్ వ్యవహారాల్లో పాకిస్తాన్ మళ్లీ తలదూర్చకుండా గట్టిగా దెబ్బకొట్టాలని మోదీని ఉద్ధవ్ కోరారు.
ఉగ్రవాదుల్లో భయం పుట్టించాం..
కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన మరో ర్యాలీలో మోదీ మాట్లాడారు. బాలాకోట్ దాడి తరువాత ఉగ్రవాదుల్లో భయం పుట్టిందని, పాకిస్తాన్‌లో అధికారంలో ఉన్న వారిని పీడకలలు వెంటాడాయన్నారు. వైమానిక దాడుల తరువాత ప్రపంచం మొత్తం భారత్‌కు మద్దతుగా నిలిస్తే కాంగ్రెస్–జేడీఎస్‌లు దుఃఖంలో మునిగాయన్నారు. అధికారం, స్వప్రయోజనాల కోసమే ఈ పార్టీలు ఒక్కటయ్యాయని విమర్శించారు. పటిష్ట ప్రభుత్వం రావాలంటే ఆలోచించి ఓటేయాలని యువతను కోరారు. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో కూడిన ప్రభుత్వం ఏర్పాటైతేనే శక్తిమంతమైన భారత్ సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment