
యువత కోసం ప్రధాని పుస్తకం!
ఈ ఏడాది చివర్లో మార్కెట్‌లోకి: పీఆర్‌హెచ్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యువత కోసం ఓ పుస్తకం రాయాలని సంకల్పించారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించడం, ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం, పరీక్షల తరువాత ఏంటనే కీలక అంశాలను ఆయన ఇందులో ప్రస్తావించనున్నారు. పదవిలో ఉండగా ఇలా పుస్తకం రాస్తున్న తొలి ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించనున్నారు.
ఈ ఏడాది చివర్లో ఈ పుస్తకం పలు భాషల్లో మార్కెట్‌లోకి వస్తుందని పెంగ్విన్ రాండమ్ హౌస్ (పీఆర్‌హెచ్) ఇండియా పబ్లిషర్లు వెల్లడించారు. దీనికి స్వచ్ఛంద సేవాసంస్థ బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సాంకేతిక విజ్ఞాన భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా పది, పదకొండు తరగతుల విద్యార్థులకు ఉపయోగపడే అంశాలెన్నింటినో మోదీ రాయనున్నారు. మార్కుల కంటే విజ్ఞానం ఎందుకు ముఖ్యం, భవిష్యత్తు బాధ్యతను ఎలా స్వీకరించాలనే విషయాలను ప్రస్తావిస్తారు. తద్వారా పరీక్షల్లో వారికి అండగా ఉండి, స్నేహితుడిగా మారాలని ప్రధాని ఆశిస్తున్నారని పబ్లిషర్లు చెప్పారు.
హృదయానికి దగ్గరగా ఉన్న అంశం...
తన ‘మన్ కీ బాత్’కు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో యువతకు ప్రయోజనం చేకూర్చే అంశాలను ఓ పుస్తక రూపంలో తేవాలని మోదీ భావించినట్టు పీఆర్‌హెచ్ సీఈఓ గౌరవ్ శ్రీనగేష్ తెలిపారు. ‘నా హృదయానికి దగ్గరగా ఉన్న అంశంపై పుస్తకం రాయాలనుకున్నా. ఆ ఆలోచనకు రూపమే యువతరం సారథ్యంలోని రేపటి భారత్‌పై పుస్తకం’ అని ప్రధాని చెప్పినట్టు పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన విషయాలతో ప్రధాని పుస్తకం రాయడం చాలా అరుదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువతకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని పీఆర్‌హెచ్ ఇండియా వాణిజ్య విభాగం చీఫ్ ఎడిటర్ మిలీ ఐశ్వర్య వెల్లడించారు.