
పేటీఎంకు లాభాలు మోదీకి విమర్శలా...
న్యూఢిల్లీ: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల నేడు అత్యధికంగా లాభ పడుతోంది ‘పేటీఎం’ అనే చెల్లింపుల సంస్థ. పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రకటన చేసిన నవంబర్ 8 నాటికి దేశంలో దాదాపు 12 కోట్ల మంది యూజర్లను కలిగి ఉన్నప్పటికీ పేటీఎమ్ నిర్వహించిన ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రమే.
పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత కారణంగా నవంబర్ 10 నుంచి డిసెంబర్ 20 తేదీ మధ్య కంపెనీకి కొత్త వినియోగదారులు రెండు కోట్ల మంది పెరిగారు. ఆ తర్వాత పెరిగిన యూజర్ల లెక్కలు అందుబాటులో లేవుగానీ మొత్తంగా నేటికి యూజర్ల సంఖ్య 20 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోని 120 నగరాలకు విస్తరించింది. 8.5 లక్షల దుకాణాలు, పెట్రోలు బంకులకు అనుసంధానమైంది. దేశంలోని 2.45 కోట్ల వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డులు, 66.18 కోట్ల డెబిట్ కార్డులు ఒక్క రోజుకు నిర్వహిస్తున్న ఆర్థిక లావాదీవీలను ఇప్పుడు రోజుకు ఒక్క పేటీఎం కంపెనీయే నిర్వహిస్తోంది. అంటే బిజినెస్ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
చుట్టుముడుతున్న వివాదాలు
ఈ పేటీఎం కంపెనీ ఆవిర్భావం నుంచి వివాదాలున్నాయి. ‘స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా’ నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని విజ్ఞాన కేంద్రంలో జనవరి 26వ తేదీన దేశంలో స్టార్టప్ కంపెనీల విధానాన్ని ప్రకంటించారు. ఇదే వేదికపై పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ ఈ ఏడాదిలోనే భారత్‌ను సంపూర్ణ క్యాష్‌లెస్ సమాజంగా మార్చేస్తానని ప్రకటించారు. అంటే డిసెంబర్ 31లో మార్చేస్తానని చెప్పారు. జూలై 18 తేదీన కంపెనీ లోగో ప్రకటించారు. పేటీఎం గురించి ప్రచారం చేశారు. పెద్దగా కంపెనీ ఆర్థిక లావాదేవీలు ఊపందుకోలేదు.
మోదీ ఫొటోతో విస్తృత ప్రచారం
ఈలోగా నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రకటన చేశారు. ఆ మరుసటి రోజే పేటీఎం కంపెనీ కోట్లాది రూపాయలను వచ్చెంచి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా వివిధ పత్రికల్లో ఫుల్ పేజీ వాణిజ్య ప్రకటనలు ఇచ్చింది. అనుమతి లేకుండా మోదీ ఫొటోను ప్రచురించడం పట్ల విమర్శులు తలెత్తాయి. మోదీ సొంత కంపెనీయా, మోదీ ఫొటోను ఉపయోగించారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.
ఆ తర్వాత వారం రోజులకు విడుదల చేసిన టీవీ యాడ్ ‘డ్రామా బంద్ కరో పేటిఎం కరో’ వివాదాస్పదమైంది. ఆ యాడ్‌లో పని మనిషి జీతం ఇవ్వాల్సిందిగా యజమానురాలిని అడుగుతోంది. ఇంట్లో డబ్బులు లేవే, బ్యాంకుకు వెళ్లాలి అని యజమానురాలు సమాధనం ఇవ్వడంతో పనిమనిషి ‘డ్రామా బంద్ కరో తనఖా పేటీఎం కరో’ అని చెప్పడం ఆ యాడ్‌లో ఉంటుంది. ఏటీఎం, బ్యాంకుల ముందు బారులు తీరి జనం ఉన్న నేపథ్యంలో ఈ యాడ్ రావడం, దానిపై విమర్శలు రేగడంతో పేటీఎం కంపెనీ యాడ్‌ను సవరించింది.
పేటీఎంలో 40 శాతం వాటా చైనా కంపెనీదే
భారత్ పట్ల శత్రు వైఖరి అవలంబిస్తూ పాకిస్తాన్ పట్ల మిత్రవైఖరి అవలంబిస్తున్న చైనాకు చెందిన ‘అలీబాబా’ కంపెనీకి పేటిఎంలో 40 శాతం వాటా వున్న విషయం తెల్సిందే. అలాంటి కంపెకీకి మోదీ సహకరిస్తున్నారంటూ సోషల్ మీడియాలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయమై శివసేన కూడా ఘూటుగా స్పందించింది. పేటీఎం కారణంగా మోదీపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. పేటీఎం కోసమే మోదీ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేశారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మోదీ ఇంకెంతమాత్రం చాయ్‌వాలా కాదు, ‘పేటీఎం వాలా’ అంటూ డిసెంబర్ 19వ తేదీన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు.
ఇప్పుడు లోగోపై వివాదం
పెద్ద నోట్ల రద్దుతో దేశంలో పేటీఎం లావాదేవీలు ఒక్కసారిగా పెరగడంతో డిసెంబర్ 20, 21 తేదీల్లో పేటీఎం సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఆ రెండు రోజులు దాదాపు లావాదేవీలు నిలిచిపోయాయి. కొంత మంది వినియోగదారుల కంపెనీని ఆరు లక్షల రూపాయల వరకు మోసం చేశారని, ఈ విషయంలో తన కంపెనీ సిబ్బంది వినియోగదారులతో లాలూచి పడ్డారని కూడా కంపెనీ ఆరోపించింది.
ఇప్పుడు తన కంపెనీ లోగోను పేటీఎం కాపీ కొట్టిందని ఆరోపిస్తూ కాలిఫోర్నియాకు చెందిన ‘పేపాల్’ అనే చెల్లింపుల సంస్థ కేసు పెట్టింది. ఇండియా ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం కంపెనీ తన లోగోను అవిష్కరించిన తర్వాత నాలుగు నెలల వరకు అభ్యంతరాల కోసం నిరీక్షించాలి. పేటీఎం తన కంపెనీ లోగోను జూలై 18న ఆవిష్కరించిన తర్వాత సరిగ్గా గడువు ముగిసే రోజున పేపాల్ కంపెనీ ఇండియా ట్రేడ్‌మార్క్ కార్యాలయానికి ఫిర్యాదు చేసింది.