'వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ ఉండాల్సిందే'
న్యూఢిల్లీ : మాజీ సైనికులకు వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ కోసం ఆందోళన చేస్తున్న మాజీ సైనికోద్యోగులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని కోరారు. దేశం కోసం పోరాడిన జవాన్లు పెన్షన్ల కోసం ఆందోళనకు దిగాల్సి రావడం దురదృష్టకరమని విమర్శించారు. వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలుచేయాలన్నారు. సాధ్యమైనంత త్వరగా పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని రాహుల్ డిమాండ్ చేశారు.
అటు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే గతంలోనే వీరికి మద్దతు తెలిపారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పై మాజీ సైనికులకు ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని ఆయన మండిపడ్డారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ను అమలుచేయకపోతే.. అక్టోబర్ 2న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.