ఆర్మీ మనసుతో ఆటలాడారు
‘ఒక ర్యాంకు ఒక పెన్షన్’ విషయంలో గత ప్రభుత్వాల తీరుపై ప్రధాని మోదీ ధ్వజం
♦ మేం తప్పకుండా ఈ విధానాన్ని అమలు చేస్తాం
♦ 40 ఏళ్లు ఓపిక పట్టారు.. నాకు కొంత సమయం ఇవ్వండి
న్యూఢిల్లీ: సైనిక దళాల్లో ‘ఒక ర్యాంకు ఒక పెన్షన్’ విధానం విషయంలో గత ప్రభుత్వాలు అనుసరించిన తీరుపై ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. ఈ విధానంపై నాన్చుడు ధోరణితో గత నలభై ఏళ్లుగా సైన్యం మనోభావాలతో ప్రభుత్వాలు ఆడుకున్నాయని విమర్శించారు.
మరికొద్ది రోజుల్లో ‘ఒక ర్యాంకు ఒక పెన్షన్ ’(ఓఆర్‌ఓపీ) పై అడ్డంకులన్నీ తొలగిపోతాయని, దీనికి తగిన పరిష్కారం కనుగొనాల్సిందిగా అన్ని విభాగాలకు సూచించినట్లు తెలిపారు. తాజాగా నిర్వహించిన ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మీరు గత 40 ఏళ్ల నుంచి ఓపిక పట్టారు. నాకు కొద్దిగా సమయం ఇవ్వండి. ఈ సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపుతా’ అని మాజీ సైనిక ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు.
ఈ విధానం అమలులో ఏళ్లుగా జరుగుతున్న జాప్యంపై మాజీ సైనిక ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తుండడం తెలిసిందే. ‘నేను ఒక్కటే చెబుతున్నా. ప్రధానిగా కాదు.. ఒక మానవత్వం ఉన్న మనిషిగా చెబుతున్నా. మేం అధికారంలోకి రాగానే సైన్యంలో ఒక ర్యాంకు ఒక పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని ఎన్నికల సమయంలో మాటా ఇచ్చా. ఆ బాధ్యత నుంచి ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి వెళ్లను. ఈ విధానం అమలు నేను ఇంతకుముందు అనుకున్నంత తేలికేమీ కాదు. సంక్లిష్టతరమే. అయినా కచ్చితంగా అమలు చేస్తాం. ఇప్పటికే వివిధ విభాగాలు దీనిపై పనిచేస్తున్నాయి.
నాపై విశ్వాసం ఉంచండి. మీకు(సైనిక దళాలు) సాయం చేయడం నా రాజకీయ ఎజెండానో, లేదా ప్రభుత్వ కార్యక్రమమో కాదు. జాతికి చేసే సేవగా భావిస్తా’ అని స్పష్టంచేశారు. ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూసినవారు సైన్యంతో గత 40 ఏళ్లుగా ఆటలాడుకున్నారని, తాను మాత్రం అలా చేయనని చెప్పారు. మరోవైపు తమకు హామీలు అక్కర్లేదని, ఈ విధానం అమలుకు కచ్చితమైన తేదీ చెప్పాలని మాజీ సైనిక సిబ్బంది కోరుతున్నారు. విధానం అమలులో జాప్యాన్ని నిరసిస్తూ జూన్ 14న నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.
ఏడాది పాలనకు డిస్టింక్షన్
తన ఏడాది పాలనకు డిస్టింక్షన్ వచ్చిందని మోదీ అన్నారు. మన్‌కీ బాత్‌లో సుమారు 25 నిమిషాలపాటు ప్రసంగించిన మోదీ.. ఏడాది పాలనపైనా కాసేపు మాట్లాడారు. ‘‘ఏడాది పాలనపై విశ్లేషణలు జరిగాయి. కొందరు విమర్శలు చేశారు. కానీ చాలామంది మాకు డిస్టింక్షనే ఇచ్చారు. పాలనపై ఇలాంటి చర్చలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిదే. కొందరు ఒక అంశాన్ని సమర్థిస్తారు. మరికొందరు విభేదిస్తారు. లోపం ఎక్కడుందో తెలుసుకునేందుకు ఇలాంటి చర్చలు దోహదపడతాయి’’ అని మోదీ అన్నారు.
పేదల కోసం ఇటీవల మూడు సామాజిక పథకాలకు శ్రీకారం చుట్టానని, వీటికి ప్రజల నుంచి విశేషమైన స్పందన వ స్తోందన్నారు. పథకాలు ప్రారంభించిన 20 రోజులకే అందులో 8.52 కోట్ల మంది చేరారని వివరించారు. అట్టడుగు వర్గాలకు అండగా నిలబడి, వారినే ఒక సైన్యంలా మలిచి దేశం నుంచి పేదరికం, ఆకలిని తరిమివేస్తామని చెప్పారు. కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన డీడీ కిసాన్ టీవీ రైతులు, జారల్లకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భారత్‌లో పాల దిగుబడి మరింత పెరగాలని, ఇందుకు ఆధునిక శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలి అని పేర్కొన్నారు.
హామీని విస్మరిస్తున్నారు: కాంగ్రెస్
ఒక ర్యాంకు ఒక పెన్షన్ విధానం హామీ నుంచి మోదీ వెనక్కి వెళ్తున్నారని, ఇది ‘సంక్లిష్ట’ సమస్య అని చెబుతూ గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి అజయ్ మాకెన్ పేర్కొన్నారు.
ఒక ర్యాంకు ఒక పెన్షన్ అంటే?
సైనిక దళాల్లో ఒకే ర్యాంకులో, సమాన సర్వీసు కాలంపాటు పనిచేసిన సిబ్బందికి ఎప్పుడు రిటైర్ అయ్యారన్న దానితో సంబంధం లేకుండా ఒకే పెన్షన్ ఇవ్వాలన్నది దీని ఉద్దేశం. ప్రస్తుతం ఎప్పుడు రిటైర్ అవుతున్నారన్న దానిపై ఆధారపడి మాజీ ఉద్యోగులకు పెన్షన్ అందిస్తున్నారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్(ఓఆర్‌ఓపీ) విధానం అమలైతే.. ఉదాహరణకు 1995లో రిటైరయిన సిపాయి, 1996లో రిటైరయిన సిపాయి ఒకే పెన్షన్‌ను పొందుతారు. ఓఆర్‌ఓపీతో 2006కు ముందు రిటైరయిన సైనిక సిబ్బందికి ప్రయోజనం చేకూరుతుంది.
ప్రస్తుతం 2006కు ముందు రిటైరయినవారు.. ఆ తర్వాత రిటైర్(ఒకే ర్యాంకు) అయినవారికంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారు. వీరికి పదేళ్లకోసారి వేతన సంఘం సిఫారసులకు పెంచుతున్న పెన్షన్ మొత్తమూ తక్కువగా వస్తోంది. ఓఆర్‌ఓపీ అమలైతే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగులకు ఈ సమస్య తీరుతుంది. ఈ పథకానికి గత యూపీఏ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది. ఎన్డీఏ తన బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించింది.