చంద్రయాన్‌-2పై మోదీ ఉద్వేగ ప్రసంగం | PM Narendra Modi Speech At Bangalore On Chandrayaan 2 | Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌-2పై మోదీ ఉద్వేగ ప్రసంగం

Published Sat, Sep 7 2019 8:39 AM | Last Updated on Sat, Sep 7 2019 9:15 AM

PM Narendra Modi Speech At Bangalore On Chandrayaan 2 - Sakshi

సాక్షి, బెంగళూరు: దేశం కలలను సాకారం చేసేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు గడిపారని.. వారందరికీ యావత్‌ దేశం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్‌-2 విజయం కోసం శాస్త్రవేత్తలు చూపిన తెగువకు దేశమంతా గర్విస్తోందని ప్రశంసించారు. భారతమాత తలెత్తుకునే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేశారని ప్రధాని అభినందించారు. బెంగళూరు సమీపంలోని బయలాలులో ఉన్న ఇస్రో టెలిమెట్రీ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌లో (ఇస్‌ట్రాక్‌)లో చంద్రయాన్‌-2 ప్రయోగంపై శనివారం ఉదయం జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్‌ మాతాకి జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. తొలుత ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ల్యాండర్‌ నుంచి సిగ్నల్స్‌ తెగిపోవడంతో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘ఈ ప్రయోగం కోసం ఎంతో మంది శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు గడిపారు. మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. మీ కృషిని యావత్‌ దేశం అర్థం చేసుకోగలదు. మీ కష్టం దేశానికి తెలుసు. భారతమత తలెత్తుకునేలా ప్రయోగం కోసం జీవితాన్ని ధారపోశారు. దేశ ప్రజల కలలను సాకారం చేసేందుకు ఎంతో శ్రమించారు. శాస్త్రవేత్తల కృషి ఎప్పటికీ వృథా కాదు. మీస్ఫూర్తి భారతీయులకు నిదర్శనం. శాస్త్రవేత్తల కుటుంబ సభ్యులకు సెల్యూట్‌ చేస్తున్నా. దీనిలో వారి త్యాగం ఎంతో ఉంది. మన అడంకులే మన మనోబలాన్ని మరింత బలోపేతం చేస్తాయి. మీరు చూపిన తెగువ మన దేశానికే కాదు యావత్‌ ప్రపంచానికి నిర్ధేశం చేసింది. మీ కృషికి ప్రతిఫలంగా దేశమంతా మీకు అండగా నిలబడుతోంది. ప్రపంచ దేశాల్లో భారత్‌ ఇప్పటికే అగ్రగామిగా ఉంది. మరిన్ని లక్ష్యాలను మనం సాధించాల్సి ఉంది. దానికోసం మరికొన్ని అంతరిక్ష ప్రయోగాలను మనం చేపట్టాలి. ఎన్నో ఆటంకాలను విజయవంతగా అధిరోహించిన చరిత్ర ఇస్రోకు ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తారనే నమ్మకం నాతోపాటు ఈ దేశ ప్రజలకూ ఉంది’ అంటూ శాస్త్రవేత్తలకు మనోధైర్యాన్ని నింపే విధంగా మోదీ ఉద్వేగంగా ప్రసంగించారు.

కాగా ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్‌–2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తొలి నుంచి అన్నీ అనుకున్నట్టే జరిగినా.. నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్‌ ల్యాండర్‌ దిగే విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్‌ పయనం.. అక్కడ కుదుపునకు లోనైనట్టు తెలుస్తోంది. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్‌ నుంచి ఇస్రో గ్రౌండ్‌ సెంటర్‌కు సిగ్నల్స్‌ నిలిచిపోయాయి. దీంతో ఏమి జరిగిందో తెలియక టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ ఈ అంశంపై ఓ ప్రకటన చేస్తూ.. 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా బాగానే సాగిందని, అక్కడే ల్యాండర్‌ నుంచి గ్రౌండ్‌ స్టేషన్‌కు సిగ్నల్స్‌ నిలిచిపోయాయని తెలిపారు. దీనిపై ల్యాండర్‌ పంపిన సందేశాలను ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.

చదవండి: చంద్రయాన్‌ టెన్షన్‌.. అందినట్టే అంది..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement