
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉద్దమ్‌సింగ్‌నగర్ జిల్లాలో ఒక ర్యాలీలో ప్రసంగించాల్సిన ప్రధాని నరేంద్రమోదీ వాతావరణం అనుకూలించకపోవడంతో నాలుగు గంటలకుపైగా డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్‌లో విమానాశ్రయంలో వేచిఉండాల్సి వచ్చింది. గురువారం ఉదయం ఏడుగంటలకు విమానాశ్రయానికి చేరుకున్న మోదీ తెల్లవారుజామునుంచే ఇక్కడ వర్షం పడుతుండడంతో దాదాపు నాలుగు గంటలకుపైగా అక్కడే నిరీక్షించారు. హెలికాప్టర్‌లో ఆయన రుద్రాపూర్ బయల్దేరాలని అనుకున్నప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా కుదరకపోవడంతో ఫోన్‌లోనే ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు. రుద్రాపూర్ రాలేకపోయినందుకు చింతిస్తున్నానంటూ క్షమాపణ కోరారు. ర్యాలీలో పాల్గొనడంతోపాటు, రాష్ట్ర సమీకృత సహకార అభివృద్ధి సంస్థను ప్రధాని ప్రారంభించాల్సి ఉంది.