
కల్తీ కూటమిని దేశం ఆమోదించబోదన్న ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : మహాకూటమితో దేశ ప్రజలకు ఒరిగేదేమీలేదని, కూటమి నేతలు కనీసం ఒకరినొకరు చూసుకునే పరిస్థితి లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోల్‌కతా వేదికగా కలిసిన మహకూటమి సర్కార్‌ను దేశ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని తాము 55 నెలల్లో చేసి చూపామన్నారు.
గత యూపీఏ హయాంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎన్నడూ అమలు చేయలేదని ఆరోపించారు. మోదీ, బీజేపీ ఆలోచనలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ దేశానికి కీడు చేస్తోందని అన్నారు. లోక్‌సభలో గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మాట్లాడుతూ విపక్షాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలతో విరుచుకుపడ్డారు. నిజాలను వినే అలవాటు కాంగ్రెస్ లేదని, ఆ పార్టీ హయాంలో ఎన్నడూ అభివృద్ధి జరగలేదని చెప్పుకొచ్చారు.
తమ ప్రభుత్వం వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయని, తాము న్యాయవ్యవస్ధ సహా వ్యవస్ధల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని భావిస్తున్నామని, తొలిసారి ఓటు వేసే యువతను ప్రోత్సహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ భారత సైన్యాన్ని అవమానించిందని, ఈసీ, సుప్రీం కోర్టులను అగౌరవపరిచేలా వ్యవహరించిందని విమర్శించారు.