
'ఆపార్టీ నేతలే వ్యతిరేకించటం హాస్యాస్పదం'
పోలవరం బిల్లు రాజ్యాంగ విరుద్ధం కాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. శనివారం న్యూఢిల్లీలో వెంకయ్యనాయుడు విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజనకు ముందే ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. 1956కు ముందు ముంపు మండలాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయో తెలుసుకోవాలని ఆయన తెలంగాణ నేతలకు హితవు పలికారు. పోలవరం ఆర్డినెన్స్ వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. గత కాంగ్రెస్ హయాంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అలాంటిది ఆ పార్టీ నేతలే వ్యతిరేకించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన సంగతి ఈ సందర్బంగా వెంకయ్య గుర్తు చేశారు. పోలవరం ఆర్డినెన్స్ ఆమోదంలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదని ఆయన స్సష్టం చేశారు. పోలవరం బిల్లుపై మరింత లోతైన చర్చ జరిగితే బాగుండేదని వెంకయ్య అభిప్రాయపడ్డారు.