రేపిస్టులను అరెస్ట్ చేయడానికి కూడా....
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడమే కారణం. పైగా ఫిర్యాదుదారులను భయపెడుతున్నారు. బెదిరిస్తున్నారు. యూపీలోని ఓ గ్రామానికి చెందిన 37 ఏళ్ల మహిళపై అమీర్ అహ్మద్ (55), సత్తార్ అహ్మద్ అనే 45 ఏళ్ల వ్యక్తి తుపాకితో బెదిరించి రేప్ చేశారు. అనంతరం ఆమె పోలీసు అధికారి జై ప్రకాష్ సింగ్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు.
అసలు రేప్ ఏ విధంగా జరిగిదంటూ ఆ పోలీసు అధికారి ఆ యువతిని గుచ్చి గుచ్చి అడగడమే కాకుండా దోషులను అరెస్ట్ చేయాలంటే తన కోరిక తీర్చాలంటూ వెంట పడ్డారు. కొంతకాలం వరకు దోషులు తన ఎదురుగానే తిరుగుతుంటే చూసి తట్టుకోలేక ఆ యువతి స్థానిక కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు కేసును నమోదు చేసిన జై ప్రకాష్ నిందితులను మాత్రం అరెస్ట్ చేయలేదు. నిందితులను అరెస్ట్ చేయాలంటూ ఆమె ఆందోళన చేసింది. అరెస్ట్ చేయాలంటే తాను చెప్పిన చోటుకు రావాలంటూ, తన కామ వాంధ తీర్చాలంటూ మళ్లీ గొడవ చేయడం మొదలు పెట్టారు. ఆమె లొంగకపోవడంతో కేసు కొట్టివేశారు.
దీంతో పోలీసు అధికారి మాటలను సెల్‌ఫోన్‌లో రహస్యంగా రికార్డు చేసిన ఆ యువతి సదరు పోలీసు అధికారిపై చర్య తీసుకోవాలంటూ పోలీసు సూపరింటెండెంట్ విజయ్ టాడాను కలసుకొని ఫిర్యాదు చేశారు. రికార్డు చేసిన మాటలను వినిపించారు. పోలీసు వీడియో మాటలకు, ఆడియో మాటలు సరిపోవడం లేదని, అయినా దర్యాప్తు జరుపుతున్నామని తనను కలసుకున్న మీడియా ప్రతినిధులకు టాడా తెలిపారు. యువతిపై గత ఫిబ్రవరిలో అత్యాచారం జరగ్గా పోలీసు అధికారి జై ప్రకాష్‌పై ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు.