ఆ నంబర్‌ ‘అందుబాటులో’ ఉండదు! | Cyber Crime Relating To Women Molestation | Sakshi
Sakshi News home page

ఆ నంబర్‌ ‘అందుబాటులో’ ఉండదు!

Published Mon, Feb 25 2019 11:39 AM | Last Updated on Mon, Feb 25 2019 11:39 AM

Cyber Crime Relating To Women Molestation - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సీజన్‌ను బట్టి ఎత్తులు వేస్తూ... అవసరానికి తగ్గట్టు పంథా మారుస్తూ ఆన్‌లైన్‌ ద్వారా రెచ్చిపోతున్న నైజీరియన్లు తాజాగా మాట్రిమోనియల్‌ మోసాల బాట పట్టారు. అవివాహిత, విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్న వీరికి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతులూ సహకరిస్తున్నారు. మాట్రిమోనియల్‌ ఫ్రాడ్స్‌తో పాటు ఫేస్‌బుక్‌ ఆధారిత నేరాలకు వీరు వర్చువల్‌ నంబర్లు వినియోగిస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు.
 
మెట్రోల్లో మాటు వేసి.. 
వివిధ రకాలైన వీసాలపై భారత్‌కు వస్తున్న నైజీరియన్లు ఢిల్లీ, ముంబై తదితర మెట్రో నగరాల్లో తిష్ట వేస్తున్నారు. లాటరీలు, బహుమతుల పేరుతో ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్స్‌ ఇస్తూ ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న వీరు తాజాగా మాట్రిమోనియల్‌ సైట్స్‌ను ఆధారం చేసుకుంటున్నారు. తాము ప్రవాస భారతీయులమని, లండన్, అమెరికాల్లో డాక్టర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పని చేస్తున్నామంటూ మారుపేర్లతో ఈ వెబ్‌సైట్స్‌లో రిజిస్టర్‌ చేసుకుంటున్నారు. తన భార్య చనిపోయిందనో, విడాకులు తీసుకున్నామనో చెబుతూ అదే కోవకు చెందిన పెళ్లి కుమార్తెల కోసం వెతుకున్నట్లు వల వేస్తున్నారు.
 
30 ఏళ్లు దాటిన వారినే ఎంచుకుని... 
ఈ ప్రొఫైల్స్‌ చూసి ఆకర్షితులవుతున్న మహిళలు ఆసక్తి చూపుతూ లైక్‌ చేసిన వెంటనే అసలు కథ ప్రారంభిస్తున్నారు. ఇలా లైక్‌ చేసిన వారిలో 30 ఏళ్లు పైబడిన మహిళలు, విడాకులు తీసుకున్న వా రు, వితంతువులను ఎంపిక చేసుకుంటున్నారు. వీరినే ఎంపిక చేసుకోవడం వెనుకా మతలబు ఉన్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. మిగిలిన మహిళలు, యువతులకు వివాహ సంబంధిత సంప్రదింపులను తల్లిదండ్రులు పర్యవేక్షిస్తా రు. వీరైతేనే నేరుగా తమంతట తామే వ్యవ హారా లు చక్కబెట్టుకునేందుకు ప్రయత్నిస్తారనే ఉద్దేశంతోనే వారిని టార్గెట్‌గా ఎంచుకుంటున్నా రు. నైజీరియన్లు వీరితో చాటింగ్‌ చూస్తూ, ఫోన్‌ నంబర్లు తీసుకుని మాట్లాడుతూ వివాహానికి సమ్మతించినట్లు చెప్పి పరిచయాన్ని కొనసాగిస్తున్నారు.
 
వర్చువల్‌ నంబర్లు ఎంపిక చేసుకుని... 
దేశంలోని మెట్రో నగరాల్లో ఉంటున్న ఈ నైజీరియన్లు తాము టార్గెట్‌గా చేసుకున్న వారితో మాట్లాడటానికి వర్చువల్‌ నంబర్ల వాడుతున్నారు. ఇంటర్‌నెట్‌లోని అనేక వెబ్‌సైట్లు ఈ ఫోన్‌ నంబర్లను నిర్ణీత కాలానికి అద్దెకు ఇస్తుంటాయి. ఆయా సైట్లలో ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన కొన్ని నంబర్లు డిస్‌ప్లే అవుతుంటాయి. వీటిలో లండన్, అమెరికాలకు చెందిన నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. వీటిని వినియోగించి సెల్‌ఫోన్‌ ద్వారా ఇంటర్‌నెట్‌ కాలింగ్‌ చేస్తే... ఆ ఫోన్‌ అందుకుంటున్న వారికి ఇతర దేశాల నంబర్లే డిస్‌ప్లే అవుతాయి. దీంతో ఆయా దేశాల నుంచే ఫోన్‌ వచ్చినట్లు భ్రమపడతారు. ఇలా కొన్ని రోజులు సాగిన తరవాత భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంటానని ఆయా మహిళలను నమ్మిస్తున్నారు.

అధికారులుగా ఈశాన్య రాష్ట్రాల యువతులు... 
కొన్ని రోజుల తరవాత వివాహ కానుకలు పంపిస్తున్నాననో, తాను వేరే దేశానికి వెళ్తున్న నేపథ్యంలో తన వద్ద ఉన్న విలువైన వస్తువులను భద్రపరిచేందుకు పంపిస్తున్నానో చెబుతూ సదరు మహిళల చిరునామా, ఫోన్‌ నంబర్‌ తదితరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఢిల్లీ, ముంబైలకు చెందిన నంబర్ల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతుల ద్వారా ఆయా మహిళలకు ఫోన్లు చేయిస్తున్నారు. కస్టమ్స్‌ అధికారులుగా పరిచయం చేసుకునే వీరు మీ పేరుతో విదేశాల నుంచి గిఫ్ట్‌ ప్యాక్‌ లేదా బంగారం వచ్చిందని, కస్టమ్స్‌ క్లియరెన్స్‌తో పాటు వివిధ పన్నుల చెల్లింపు జరగని నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో ఆగిపోయిందని మహిళలకు చెబుతున్నారు.

ఆయా పన్నుల నిమిత్తం నిర్ణీత మొత్తాలను తాము చెప్పిన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేయాల్సిందిగా కోరుతున్నారు. సాధారణంగా ఈ టార్గెట్‌ మహిళలు ఉద్యోగ, వ్యాపార రంగాలకు చెందిన వారే కావడంతో ఈ మాటలు నమ్మి పలు దఫాలుగా వారి కోరిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేస్తున్నారు. బోగస్‌ పేర్లు, వివరాలను తెరుస్తున్న ఈ ఖాతాల్లో డిపాజిట్‌ అయిన సొమ్మును ఎప్పటికప్పుడు డ్రా చేసుకుంటూ టోకరా వేస్తున్నారు.  

తెలుసుకోకుండా నమ్మవద్దు
‘కేవలం మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లు మాత్రమే కాదు ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌ ద్వారా అయిన పరిచయాలను నమ్మకూడదు. అవతలి వ్యక్తిని వ్యక్తిగతంగా కలవడమో, పూర్తి వివరాలు సరిచూసుకోవడమో చేయకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నెరపవద్దు. ఈ తరహా కేసుల్లో అనేక కష్టనష్టాలకు ఓర్చి నిందితుల్ని పట్టుకున్నా వారి నుంచి నగదు రికవరీ అసాధ్యం. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి మోసగాళ్లకు చెక్‌ చెప్పడానికి అవకాశం ఉంటుంది’ – సైబర్‌ క్రైమ్‌ పోలీసులు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement