98 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు చిమన్ లాల్ జైన్ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఆగ్రా: 98 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు చిమన్ లాల్ జైన్ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మద్యనిషేధాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ‘జలసమాధి’ పేరిట యమునా నదిలో దూకేందుకు అక్కడికి బయల్దేరాడు. ఆయన వెంట గరీబ్‌సేనకు చెందిన నాయకులు, పెద్దసంఖ్యలో నది వద్దకు వెళుతుండగా ఈ సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు.
మార్గమధ్యలో చిమన్ లాల్‌ను అడ్డుకుని తమ జీపులో పోలీస్‌స్టేషన్కు తరలించారు. అనంతరం జైన్ మీడియాతో మాట్లాడుతూ మద్యం వినియోగం వల్ల కలిగే నష్టాలను ఇకమీదటకూడా అందరికీ వివరిస్తానని, వారికి అవగాహన కల్పిస్తానని పేర్కొన్నారు. మద్యనిషేధం అమలు చేయాలంటూ చిమన్ లాల్‌జైన్ గతంలోనూ అనేక పర్యాయాలు ఆత్మహత్యకు పాల్పడగా ప్రతిసారీ పోలీసులు అడ్డుకున్నారు.