సాక్షి, ముంబై: ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన నిధుల కోసం సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు ఈ ఏడాది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విరాళాల కోసం తమ మండళ్ల పరిధిలో ఉన్న ఇళ్లు, షాపుల చుట్టూ తిరగనవసరం అంతకంటే లేదు. శాసనసభ ఎన్నికల పుణ్యమా... అని ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక మంది ప్రజా ప్రతినిధులు విరాళాలు అందజేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. దీంతో మండళ్లకు ఈ ఏడాది నిథుల కొరత ఉండదని స్పష్టమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా పది రోజుల పాటు ఘనంగా జరుపుకునే ఉత్సవాలు ఇదొక్కటే. అన్ని రోజుల పాటు నిర్వహణ అనేది ఆషామాషీ వ్యవహారంకాదు. ముంబై లాంటి మహానగరంలో వందలాది సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు ఉన్నాయి. వేదిక, అలంకరణ, విగ్రహ ఏర్పాటు వంటి పనుల్లో తామే ముందుండాలని పోటీ పడతారు. అందుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తారు. కొన్ని మండళ్లయితే రూ. కోట్లలో ఖర్చు చేస్తాయి. ఈ మండళ్లు తమ పరిధిలోని ఇళ్లు, వ్యాపారులు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల నుంచి విరాళాలు సేకరిస్తాయి.
అదేవిధంగా రాజకీయ పార్టీల బ్యానర్లు, వివిధ సంస్థల ప్రకటనల బోర్డుల ద్వారా కూడా కొంత ఆదాయం వస్తుంది. కాని ఈ విరాళాలు కూడా ఎటూ సరిపోవు. దీంతో ఎవరైనా స్పాన్సర్స్ దొరుకుతారేమోనని మండళి పదాధికారులు గాలిస్తారు. కాగా ఈసారి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గణేష్ మండళ్ల ప్రవేశ ద్వారాలు, బ్యానర్లు, ప్లెక్సీల ఏర్పాటుపై కొన్ని ఆంక్షలు విధించడంతో వాటి ఆదాయానికి కొంత గండిపడింది.
కాని ఈసారి సెప్టెంబరులో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆగస్టు 29న వినాయక చవితి ఉండడంతో మండ ళ్లకు కలిసివస్తోంది. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రజా ప్రతినిధులు స్థానిక సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లను ఆశ్రయిస్తున్నారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన నిథులు అందజేసేందుకు ముందుకు వస్తున్నారు. గత 20-25 సంవత్సరాల నుంచి భారీ అలంకరణ, ఎత్తై విగ్రహాలు ఏర్పాటు చేయడంలో ప్రఖ్యాతిగాంచిన లాల్‌బాగ్, కరీరోడ్ ప్రాంతంలో మండళ్ల మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఇక్కడి సార్వజనిక గణేశ్ మండళ్ల పదాధికారులతో కొందరు రాజకీయ నాయకులు భేటీ అయ్యారు.
కొందరు ఉత్సవాల పూర్తి ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించగా మరికొందరు అలంకరణ, లడ్డూ ప్రసాదం, విద్యుత్ దీపాల ఖర్చు భరించేందుకు ముందుకొచ్చారు. మరికొందరు గణేశ్ ఉత్సవాలతోపాటు ఈ సంవత్సరం నిర్వహించే వివిధ కార్యక్రమాలకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినట్లు ఓ మండలి పదాధికారి చెప్పారు. ఇదే పరిస్థితి గిర్గావ్, దాదర్, విలేపార్లే, అంధేరీ, భాండూప్ తదితర ప్రధాన ప్రాంతాల్లో ఉంది. అయితే విరాళాలు అందజేసినట్లు ఎక్కడ తమ పార్టీ పేరుగాని, ప్రజాప్రతినిధి పేరుగాని బయటపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదిఏమైనా ఈ ఏడాది శాసన సభ ఎన్నికల కారణంగా సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లకు భారీగా విరాళాలు రావడం ఖాయమని స్పష్టమైంది.
‘గణనాథుడి’కి గాలం
Published Mon, Jul 28 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM
Advertisement