Donations of political parties
-
జాతీయ పార్టీలకు రూ.15,077 కోట్లు.. ఎవరిచ్చారో అస్సలు తెలియదు!
న్యూఢిల్లీ: జాతీయ పార్టీలు 2004 నుంచి 2021 వరకు వివరాలు వెల్లడించని వ్యక్తులు, సంస్థల నుంచి సుమారు రూ.15,077.97 కోట్లు విరాళాలు అందుకున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్-ఏడీఆర్ నివేదిక తెలిపింది. అయితే.. ఒక్క 2020-21 ఆర్థిక ఏడాదిలోనే జాతీయ, ప్రాంతీయ పార్టీలు గుర్తు తెలియని వారి నుంచి రూ.690.67 కోట్లు విరాళంగా స్వీకరించినట్లు పేర్కొంది. ఈ నివేదికలో.. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ వంటి ఎనిమిది జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకుని వివరాలు వెల్లడించింది ఏడీఆర్. 2004-05 నుంచి 2020-21 వరకు ఎన్నికల సంఘానికి పార్టీలు సమర్పించిన విరాళాలు, ఆదాయపన్ను రిటర్న్‌ల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది ఏడీఆర్. ఎలాంటి వివరాలు వెల్లడించని వ్యక్తులు, సంస్థల నుంచి జాతీయ పార్టీలు సుమారు రూ.15,077.97 కోట్లు విరాళంగా అందుకున్నట్లు స్పష్టం చేసింది. ‘2020-21 ఆర్థిక ఏడాదిలో 8 జాతీయ పార్టీలు గుర్తుతెలియని వారి నుంచి రూ.426.74 కోట్లు అందుకోగా.. 27 ప్రాంతీయ పార్టీలు రూ.263.928 కోట్లు విరాళంగా పొందాయి.’అని తెలిపింది ఏడీఆర్. తొలిస్థానంలో కాంగ్రెస్.. 2020-21లో కాంగ్రెస్ పార్టీ రూ.178.782 కోట్లు వివరాలు వెల్లడించని వ్యక్తులు, సంస్థల నుంచి పొందిందని, అది మొత్తం జాతీయ పార్టీలు పొందిన దాంట్లో 41.89 శాతమని తెలిపింది ఏడీఆర్. ఇదే అత్యధికమని పేర్కొంది. మరోవైపు.. బీజేపీకి రూ.100.502 కోట్లు అందాయి. అది మొత్తం వివరాలు లేని వారి నుంచి అందిన దాంట్లో 23.55 శాతంగా తెలిపింది. మరోవైపు.. వివరాలు లేని సోర్స్‌ల నుంచి ఎక్కువ మొత్తంలో విరాళాలు అందుకున్న మొదటి ఐదు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ రూ.96.2507 కోట్లు, డీఎంకే రూ.80.02 కోట్లు, బీజేడీ రూ.67 కోట్లు, ఎంఎన్ఎస్ రూ.5.773 కోట్లు, ఆప్ రూ.5.4కోట్లుగా నివేదిక తెలిపింది. ఇదీ చదవండి: Cartoon Today: రాజకీయ పార్టీలకు కోవిడ్ దెబ్బ.. 41 శాతం తగ్గిన విరాళాలు -
కోవిడ్ ఎఫెక్ట్.. బీజేపీకి భారీగా తగ్గిన విరాళాలు.. కాంగ్రెస్‌కు ఎంతంటే?
ఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసమంటూ విధించిన లాక్‌డౌన్‌తో దేశంలోని అనేక రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ ప్రభావం రాజకీయ పార్టీలపైనా పడింది. కోవిడ్ సమయంలో జాతీయ పార్టీలకు అందిన విరాళాలు దాదాపుగా సగం మేర తగ్గిపోయాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని గుర్తింపు పొందిన జాతీయ పార్టీల విరాళాలు రూ.420 కోట్ల మేర తగ్గిపోయినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఆ విలువ 41.49 శాతం తక్కువగా పేర్కొంది. బీజేపీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.785.77 కోట్లు విరాళాలు రాగా.. 2020-21లో 39.23 శాతం తగ్గి రూ.477.54కోట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 2019-20లో రూ.139.01 కోట్లు విరాళాలు రాగా.. 2020-21లో 46.39శాతం తగ్గి రూ.74.52 కోట్లు మాత్రమే అందాయి. అత్యధికంగా ఢిల్లీ నుంచి జాతీయ పార్టీలకు రూ.246 కోట్లు విరాళంగా వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి రూ.71.68 కోట్లు, గుజరాత్ నుంచి రూ.47 కోట్లు అందాయి. బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలు.. విరాళాల్లో 80 శాతాన్ని ఆక్రమించగా.. మిగిలిన 20 శాతం చిన్న పార్టీలకు అందాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం రూ.480 కోట్లు కార్పొరేట్, బిజినెస్ రంగాల నుంచి వచ్చాయి. మరోవైపు.. రూ.111 కోట్లు విరాళాలు 2,258 మంది వ్యక్తులు అందించారు. సుమారు రూ.37 కోట్ల విరాళాలకు సరైన ఆధారాలు లేకపోవటం వల్ల ఏ రాష్ట్రం నుంచి వచ్చాయనే వివరాలు వెల్లడికాలేదు. బీజేపీకి మొత్తం 1,100 విరాళాలు కార్పొరేట్, బిజినెస్ సెక్టార్ల నుంచి వచ్చాయి. కాంగ్రెస్‌కు 146 విరాళాలు వచ్చాయి. ఇదీ చూడండి: ఓపీఎస్‌కు మరో షాకిచ్చిన ఈపీఎస్.. 18 మంది బహిష్కరణ -
విరాళాల ‘మొత్తం’ను 2 వేలు చేయండి
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల విషయంలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచన చేసింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి పార్టీలు స్వీకరించే విరాళాల గరిష్ట మొత్తాన్ని రూ.20 వేల నుంచి రూ.2 వేలకు తగ్గించాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఎన్నికల సంఘం గత వారం కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది. తాము కోరినట్లు ఒక్కో వ్యక్తి నగదు రూపంలో పార్టీలకు చెల్లించే గరిష్ట మొత్తాన్ని కేంద్రం రూ.2,000కు తగ్గించిందని లేఖలో తెలిపింది. గుప్త విరాళాల విషయంలో రూ.2 వేలు పరిమితిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేసింది. రాజకీయ పార్టీలు గుప్త విరాళాలు అందుకోవడంపై రాజ్యాంగంలో నిషేధం లేదన్న ఈసీ.. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29సీ మాత్రం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి విరాళాలను అందుకోవడాన్ని పరోక్షంగా నిషేధిస్తుందని తెలిపింది. గుప్తవిరాళాల కింద రూ.20 వేలు అందుకున్న అవకాశమున్న నేపథ్యంలో అది నగదు రూపంలో కూడా ఉండొచ్చనీ, దీని కారణంగా గరిష్టంగా రూ.2 వేల నగదు మాత్రమే ఇవ్వాలన్న నిబంధనకు తూట్లు పొడిచినట్లే అవుతుందని అభిప్రాయపడింది. -
‘గణనాథుడి’కి గాలం
సాక్షి, ముంబై: ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన నిధుల కోసం సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు ఈ ఏడాది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విరాళాల కోసం తమ మండళ్ల పరిధిలో ఉన్న ఇళ్లు, షాపుల చుట్టూ తిరగనవసరం అంతకంటే లేదు. శాసనసభ ఎన్నికల పుణ్యమా... అని ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక మంది ప్రజా ప్రతినిధులు విరాళాలు అందజేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. దీంతో మండళ్లకు ఈ ఏడాది నిథుల కొరత ఉండదని స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పది రోజుల పాటు ఘనంగా జరుపుకునే ఉత్సవాలు ఇదొక్కటే. అన్ని రోజుల పాటు నిర్వహణ అనేది ఆషామాషీ వ్యవహారంకాదు. ముంబై లాంటి మహానగరంలో వందలాది సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు ఉన్నాయి. వేదిక, అలంకరణ, విగ్రహ ఏర్పాటు వంటి పనుల్లో తామే ముందుండాలని పోటీ పడతారు. అందుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తారు. కొన్ని మండళ్లయితే రూ. కోట్లలో ఖర్చు చేస్తాయి. ఈ మండళ్లు తమ పరిధిలోని ఇళ్లు, వ్యాపారులు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థల నుంచి విరాళాలు సేకరిస్తాయి. అదేవిధంగా రాజకీయ పార్టీల బ్యానర్లు, వివిధ సంస్థల ప్రకటనల బోర్డుల ద్వారా కూడా కొంత ఆదాయం వస్తుంది. కాని ఈ విరాళాలు కూడా ఎటూ సరిపోవు. దీంతో ఎవరైనా స్పాన్సర్స్ దొరుకుతారేమోనని మండళి పదాధికారులు గాలిస్తారు. కాగా ఈసారి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గణేష్ మండళ్ల ప్రవేశ ద్వారాలు, బ్యానర్లు, ప్లెక్సీల ఏర్పాటుపై కొన్ని ఆంక్షలు విధించడంతో వాటి ఆదాయానికి కొంత గండిపడింది. కాని ఈసారి సెప్టెంబరులో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆగస్టు 29న వినాయక చవితి ఉండడంతో మండ ళ్లకు కలిసివస్తోంది. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రజా ప్రతినిధులు స్థానిక సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లను ఆశ్రయిస్తున్నారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన నిథులు అందజేసేందుకు ముందుకు వస్తున్నారు. గత 20-25 సంవత్సరాల నుంచి భారీ అలంకరణ, ఎత్తై విగ్రహాలు ఏర్పాటు చేయడంలో ప్రఖ్యాతిగాంచిన లాల్బాగ్, కరీరోడ్ ప్రాంతంలో మండళ్ల మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఇక్కడి సార్వజనిక గణేశ్ మండళ్ల పదాధికారులతో కొందరు రాజకీయ నాయకులు భేటీ అయ్యారు. కొందరు ఉత్సవాల పూర్తి ఖర్చును భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించగా మరికొందరు అలంకరణ, లడ్డూ ప్రసాదం, విద్యుత్ దీపాల ఖర్చు భరించేందుకు ముందుకొచ్చారు. మరికొందరు గణేశ్ ఉత్సవాలతోపాటు ఈ సంవత్సరం నిర్వహించే వివిధ కార్యక్రమాలకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినట్లు ఓ మండలి పదాధికారి చెప్పారు. ఇదే పరిస్థితి గిర్గావ్, దాదర్, విలేపార్లే, అంధేరీ, భాండూప్ తదితర ప్రధాన ప్రాంతాల్లో ఉంది. అయితే విరాళాలు అందజేసినట్లు ఎక్కడ తమ పార్టీ పేరుగాని, ప్రజాప్రతినిధి పేరుగాని బయటపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదిఏమైనా ఈ ఏడాది శాసన సభ ఎన్నికల కారణంగా సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లకు భారీగా విరాళాలు రావడం ఖాయమని స్పష్టమైంది.