ప్రకాశ్‌రాజ్‌తో భార్య సెల్ఫీ.. ఇంతలోనే భర్త వచ్చి..! | Prakash Raj Tweets An Unpleasant Encounter | Sakshi
Sakshi News home page

ప్రకాశ్‌రాజ్‌తో భార్య సెల్ఫీ.. ఇంతలోనే భర్త వచ్చి..!

Published Sat, Jun 15 2019 2:28 PM | Last Updated on Sat, Jun 15 2019 3:02 PM

Prakash Raj Tweets An Unpleasant Encounter  - Sakshi

సాక్షి, బెంగళూరు: ఇటీవల తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. ఇటీవల ఆయన కశ్మీర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో ఆయన విహరిస్తుండగా ఓ మహిళా అభిమాని తన కూతురితో కలిసి ప్రకాశ్‌ రాజ్‌తో సెల్ఫీ దిగాలని కోరింది. అభిమాని కోరడంతో ప్రకాశ్‌ రాజ్‌ అందుకు ఆనందంగా అంగీకరించారు. సెల్ఫీలు దిగిన తర్వాత ఆమె భర్త ఒక్కసారిగా ప్రవేశించాడు. ప్రకాశ్‌ రాజ్‌ చాలాసార్లు ప్రధాని నరేంద్రమోదీని విమర్శించారని, ఆయనతో సెల్ఫీలు దిగుతావా అంటూ తన భార్యపై అతను ఆగ్రహం​ వ్యక్తం చేశాడు. సెల్ఫీలు ఫోన్‌లోంచి డిలీట్‌ చేయమని డిమాండ్‌ చేశాడు. దీంతో ప్రకాశ్‌ రాజ్‌ ఓ మంచి సలహా ఇచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

‘కశ్మీర్‌లో ఒక సందర్భంలో ఇది జరిగింది. ఇతరుల కోసం మనల్ని ప్రేమించేవారిని ఎందుకు బాధించాలి? అభిప్రాయభేదాలు ఉన్నంతమాత్రాన మనం ఎందుకు ద్వేషించుకోవాలి’ అంటూ ఈ ఘటనను ట్వీట్‌ చేశారు. ఆయన ఏమన్నారంటే.. ‘కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో ఉన్న హోటల్‌ నుంచి బయటకు రాగానే ఓ యువతి తన కూతురితో కలిసి నా దగ్గరికి వచ్చి సెల్ఫీ కావాలని అడిగింది. నేను అందుకు అంగీకరించాను. వాళ్లు ఎంతో ఆనందించారు. కానీ ఇంతలోనే తిట్లు తిట్టుకుంటూ ఆమె భర్త అక్కడికి వచ్చాడు. నేను మోదీతో విభేదిస్తాను కాబట్టి నాతో దిగిన సెల్ఫీలు డిలీట్‌ చేయాలని వారికి హుకుం జారీ చేశాడు. చుట్టూ ఉన్న పర్యాటకులు ఇదంతా గమనిస్తున్నారు. ఆ మహిళ ఒక్కసారిగా కన్నీళ్లపర్యంతమైంది. దీంతో నేను అతన్ని పక్కకు తీసుకెళ్లి మాట్లాడాను.

‘డియర్‌ సర్‌.. మీ భార్య మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి, అద్భుతమైన కూతుర్ని మీకు ఇవ్వడానికి, మీతో జీవితాన్ని పంచుకోవడానికి నేనో, మోదీనో కారణం కాదు. దయచేసి వాళ్ల అభిప్రాయాన్ని గౌరవించండి. వారు మీ అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తారు. సెలవులను ఆస్వాదించండి’ అని చెప్పాను. అతను జవాబు ఇవ్వకుండా అలాగే నిల్చుండిపోయాడు. నేను భారమైన హృదయంతో అక్కడి నుంచి కదిలాను. అతను నా ఫొటోలు డిలీట్‌ చేయించాడా? లేదా అన్నది తెలియదు. కానీ, వారికి చేసిన గాయాన్ని అతను మాన్పగలడా?’ అని పేర్కొన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వంపై గతంలో పలు సందర్భాల్లో ప్రకాశ్‌ రాజ్‌ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓడిపోయిన సంగతి తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement