బెంగళూరు : నగరంలో కళాశాల విద్యార్థి కిడ్నాప్ ఉదంతం సంచలనం సృష్టించింది. సంఘటన జరిగిన 12 గంటల్లోనే ఛేదించి యువకుడిని క్షేమంగా విడిపించినట్లు డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు. అయితే పరారీలో ఉన్న నిందితులు కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దేవయ్య పార్కు సమీపంలో నివాసముంటున్న రమేష్ కుమారుడు ప్రతీక్ (18) ప్రతీక్ సెయింట్ జోసెఫ్ కళాశాలలో పీయుసీ చదువుతున్నాడు.
సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రతీక్ స్కూటర్‌లో ఇంటికి ఇంటికి బయలుదేరాడు. మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో వెళ్తుండగా ముందు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం వేగం తగ్గించడంతో దాని వెనుకనే వస్తున్న ప్రతీక్ కూడా స్కూటర్ వేగాన్ని తగ్గించాడు. వారి వెనుకనే మారుతి వ్యాన్‌లో వస్తున్న దుండగులు ప్రతీక్‌ను పట్టుకుని వ్యాన్ లోపలికి లాగేసుకుని వేగంగా వెళ్లిపోయారు. అనంతరం రమేష్‌కు ఫోన్ చేసి కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు చెప్పారు.
రూ. 50 లక్షలు డిమాండ్ చేశారు. ఆందోళన చెందిన రమేష్ హుటాహుటిన సుబ్రమణ్యనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వయంగా డీసీపీ సందీప్ పాటిల్ రంగంలోకి దిగి ఏడుగురు సీఐల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సిటీ మొత్తం జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో కిడ్నాపర్లతో మాటలు కలపాలని రమేష్‌కు పోలీసులు సూచించారు. రూ. 50 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు రూ. 20 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.
రాత్రంతా దుండగులు ప్రతీక్‌ను కారులో నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పారు. కిడ్నాపర్లు మొదట లాల్‌బాగ్ ఈస్ట్‌గేట్ దగ్గరకు నగదు తీసుకురావాలని ఒత్తిడి తెచ్చారు. రమేష్ నగదు తీసుకుని అక్కడి చేరుకున్నాడు. పోలీసులు కూడా వచ్చారని గుర్తించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. నిమ్హాన్స్, కిద్వాయ్ ఆస్పత్రికి వద్దకు రావాలని చెప్పి అక్కడి నుంచి కూడా వెళ్లిపోయారు.
మంగళవారం వేకువ జామున నాలుగు గంటల సమయంలో బెంగళూరు- హొసూరు రోడ్డులోని డెయిరీ సర్కిల్ దగ్గరకు రావాలని చెప్పారు. రమేష్ నగదు బ్యాగ్ తీసుకుని అక్కడికి వెళ్లాడు. అక్కడికి బైక్‌లో వచ్చిన నిందితుడు నగదు బ్యాగ్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మొదట కుమారుడిని చూపించాలని రమేష్ అన టంతో కిడ్నాపర్ బ్యాగ్ లాక్కొటానికి యత్నించాడు. ఇదే సమయంలో పోలీసులు వచ్చారని తెలుసుకున్న నిందితులు అక్కడి నుంచి వేగంగా వాహనంలో వెళ్లిపోయారు. వెనుకాలే పోలీసులు వస్తున్నట్లు గ్రహించిన కిడ్నాపర్లు లక్కసంద్ర వద్ద ప్రతీక్‌ను వదిలి పరారయ్యారు. కిడ్నాపర్లు కన్నడలోనే మాట్లాడారని ప్రతీక్ తెలిపారు. తెలిసిన వారి పనే అయి ఉంటుందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు.
పీయూసీ విద్యార్థి కిడ్నాప్ కథ సుఖాంతం
Published Wed, Jul 16 2014 4:06 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM
Advertisement