ప్రత్యూష బేనర్జీ, రాహుల్ రాజ్ సింగ్(ఫైల్)
ముంబై: ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బేనర్జీ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వ్యభిచారం చేయాలని ప్రత్యూషను ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. వారిద్దరి మధ్య ఫోన్లలో చివరిసారిగా జరిగిన సంభాషణలను 'ముంబై మిర్రర్' వెల్లడించింది. మూడు నిమిషాల నిడివున్న ఈ ఫోన్ సంభాషణలు ప్రత్యూష్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు జరిగినట్టు తెలిపింది.
'నన్ను నేను అమ్ముకోవడానికి ఇక్కడికి రాలేదు. నటించడానికి, పనిచేయడానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఈరోజు నన్ను నువ్వు ఎక్కడ ఉంచావు? రాహుల్... నీకు తెలీదు ఇప్పడు నేనెంతగా కుమిలిపోతున్నానో. నువ్వు స్వార్థపరుడివి. నా పేరును చెడగొట్టావు. జనం నన్ను, నా తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడుకుంటున్నార'ని ప్రత్యూష ఫోన్ లో వాపోయింది. వ్యభిచారం చేయమని ప్రత్యూషను రాహుల్ ఒత్తిడి చేశాడని ఆమె తరపు న్యాయవాది నీరజ్ గుప్తా ఆరోపించారు. ప్రత్యూష చివరిసారిగా రాహుల్ తో ఫోన్ లో మాట్లాడినప్పుడు 'వ్యభిచారం' అనే పదం వాడిందని తెలిపారు.
అయితే ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్రత్యూషపై ఆమె తల్లిదండ్రులే ఒత్తిడి తెచ్చారని రాహుల్ అంతకుముందు చెప్పాడు. డబ్బుకోసమే ప్రత్యూష తల్లిదండ్రులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. ప్రత్యూషకు అవకాశాలు దొరకప్పుడు తానే అండగా నిలిచానని బెయిల్ పై విడుదలైన రాహుల్ చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 1న ఆంధేరిలోని అపార్ట్ మెంట్ లో ఉరేసుకుని ప్రత్యూష్ ఆత్మహత్య చేసుకుంది.