
‘వాళ్లు రెండు నరికితే.. మనం 50 తలలు నరకాలి’
తిరుమల: విశ్వ హిందు పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్తాన్ సైనికులు మన ఇద్దరు జవాన్ల తలలు తీసుకెళ్లినందుకు బదులుగా.. మనం 50 మంది పాకిస్తాన్ సైనికుల తలలను తెగ నరకాలి. మనదేశంపై పాకిస్తాన్ అప్రకటిత యుద్ధం చేస్తోంది. సైనికులకు మద్దతుగా జై జవాన్.. జై కిసాన్ నినాదం ఇవ్వాల్సిన అవసరం మళ్లీ వచ్చిందని’ ఆయన పేర్కొన్నారు. తిరుమలలో పర్యటిస్తున్న తొగాడియా శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ సిబ్బంది ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
స్వామివారి సేవలో పాల్గొన్న అంనంతరం రంగనాయకుల మండపం వద్ద శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మన వీర జవాన్లు ఇద్దరి తలల తీసుకెళ్లినందుకు, పాక్ నుంచి 50 మంది సైనికుల తలలు తెగనరికి తీసుకురావాలని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌పై భారత్ బాంబు వేసి, ఆ దేశం మరణశిక్ష విధించిన మన నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను విడిపించాలని తొగాడియా గత నెలలో అన్నారు. భారత్ మాతాకి జై అన్నవాళ్లే మన సోదరులు అని గతేడాది ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.