
న్యూఢిల్లీ: నేపాల్‌కు కాబోయే ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి సహా ఆ దేశ ప్రముఖ నాయకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఫోన్‌లో మాట్లాడారు. ఈ హిమాలయ దేశంలో సాధారణ ఎన్నికల అనంతరం ఇరు దేశాల నాయకత్వాల మధ్య ఇవే తొలి అత్యున్నత స్థాయి చర్చలని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(సీపీఎన్–యూఎంఎల్) చైర్మన్ ఓలి, సీపీఎన్(ఎంసీ) చైర్మన్ పుష్ప కమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ కూటమి కొద్ది రోజుల కిందట నేపాల్ ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మోదీ నేపాల్ ప్రస్తుత ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా, ఓలి, ప్రచండలతో చర్చలు జరిపారు. ‘ఇరు దేశాల నాయకుల మధ్య చర్చలు జరిగినట్లు నాకు ఇప్పుడే సమాచారం అందింది. అయితే ఏయే అంశాలపై చర్చించారనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ పేర్కొన్నారు. నేపాల్‌లో కమ్యూనిస్ట్ కూటమి విజయం ఆ దేశంలోని చైనా అనుకూల వర్గీయుల గెలుపుగా భావిస్తున్న తరుణంలో మోదీ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.