లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే తన అనుచరులతో కలిసి ఎనిమిది మంది పోలీసులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నేరాల విషయంలో యూపీ ప్రథమస్థానంలో ఉందని ఆరోపించారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాల నుంచి దేశ వ్యాప్తంగా నమోదవుతున్న నేరాల గురించి పరిశీలించినట్లయితే.. యూపీ దేశంలో టాప్‌లో కొనసాగుతుంది. ఇక్కడ ప్రతిరోజు సరాసరి 12 హత్యలు వెలుగు చూస్తున్నాయి. 2016-18 మధ్య కాలంలో పిల్లల మీద జరిగిన నేరాలు 24 శాతం పెరిగాయి. యూపీ హోం మంత్రిత్వశాఖ, ముఖ్యమంత్రి ఈ గణాంకాలను కవర్ చేయడం తప్ప ఇంకేమీ చేయడం లేదు’ అంటూ ప్రియాంక విమర్శలు చేశారు.
అంతేకాక వికాస్ దూబేతో జరిగన ఘర్షణలో మరణించిన పోలీసు అధికారి దేవేంద్ర మిశ్రా అప్పటి ఎస్‌ఎస్‌పీకి రాసిన లేఖ గురించి ప్రియాంక గాంధీ ప్రస్తావించారు. ‘దేవేంద్ర మిశ్రా రాసిన లేఖ మిస్సయినట్లు చాలా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటన్నింటిని పరిశీలిస్తే.. యూపీ హోం శాఖ పని తీరుపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి’ అన్నారు. రాష్ట్రంలో నేరస్తులు స్వేచ్ఛగా సంచరిస్తుండగా.. అధికారం, శాంతిభద్రతలు వారి ముందు మోకరిల్లుతున్నాయని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థతకు అంకితభావంతో పని చేస్తున్న అధికారులు, పోలీసులు ఫలితం అనుభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై, మహిళలపై నేరాలు పెరుగుతున్నా పట్టించుకోకుండా రాష్ట్రంలో మహిళలపై నేరాలే జరగడం లేదని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించడం సిగ్గు చేటు అంటూ ప్రియాంక వరుస విమర్శలు చేశారు.(నేర సామ్రాజ్యం)
అనేక నేరారోపణలు ఎదుర్కొంటున్న వికాస్ దూబేను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గతవారం జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనలో దూబే పారిపోవడానికి సహకరించిన చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారి వినయ్ తివారీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వికాస్‌తో పాటు ఇతర అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా పరారీలో ఉన్న వికాస్ దూబేను పట్టిస్తే రూ.2.5 లక్షలు బహుమతి ఇస్తామని యూపీ పోలీసులు ప్రకటించారు. తొలుత వికాస్ దూబేను అతని అనుచరులను పట్టిస్తే 50వేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. కానీ వికాస్ దూబే జాడ దోరక్కపోవడంతో నగదు బహుమతిని రూ. లక్షకు పెంచారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆ నగదు బహుమతిని ఏకంగా 2.5లక్షలు పెంచినట్లు ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్‌సీ అవస్థీ వెల్లడించారు
Comments
Please login to add a commentAdd a comment