
లక్నో: సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రమాదం వెనుక బీజేపీ హస్తముందంటూ యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇదివరకే ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, యూపీ ఇన్‌ఛార్జ్ ప్రియాంక గాంధీ ఘటనపై అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం ఈ ప్రమాదంపై స్పందించిన ఆమె.. ప్రభుత్వంపై, పోలీస్ శాఖపై ప్రశ్నల వర్షం కురిపించారు.
‘‘బాధితురాలి కారు ప్రమాదానికి గురికావడం నన్ను షాకింగ్‌కు గురిచేసింది. పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేశారు. దానిని వెంటనే బహిర్గతం చేయాలి. అసలు అత్యాచార ఘటనపై సీబీఐ కేసు విచారణ ఎంత వరకు వచ్చింది. ఇలాంటి ఘటనకు పాల్పడిన వ్యక్తులను ప్రభుత్వం ఎందుకు వెనకేసుకొస్తోంది. ఇంకా ఆయన బీజేపీలో ఎందుకు కొనసాగుతున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏమైనా న్యాయం చేకూరుతుందని నమ్ముతున్నారా?. అంటూ తన ట్విటర్ ఖాతాలో ప్రశ్నలు సంధించారు. ప్రమాదానికి కారకులయిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రియాంక డిమాండ్ చేశారు.
కాగా ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించడం సంచలనంగా మారింది. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆమె తండ్రినే అరెస్టు చేసి హింసించడంతో ఆయన పోలీస్ కస్టడీలోనే మరణించారు.
దీంతో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేసినా అతను బెయిలుపై బయటకొచ్చాడు. దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కేసును సీబీఐ విచారణకు అప్పగించారు. తాజాగా బాధితురాలు, ఇద్దరు మహిళలు, లాయర్‌తో కలిసి రాయ్‌బరేలీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా, బాధితురాలు, లాయర్ తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఆమెను చంపేందుకే ఈ ప్రమాదం చేయించారని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. బాధితురాలి వెంట ఉండాల్సిన భద్రతా సిబ్బంది ఎందుకు లేరనే విషయం కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.