
‘ప్రియాంక రాలేరు.. ప్రచారం చేయలేరు’
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీపై బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు
కాన్పూర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీపై బీజేపీ నేత, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అమేథీలో ప్రియాంక ప్రచారం చేయలేరని, ఎందుకంటే అక్కడి ప్రజలు వేసే ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పలేరని విమర్శించారు. ప్రస్తుతం పార్టీ తరపున ప్రచార కార్యక్రమాల్లో ఉన్న స్మృతి ఉత్తరప్రదేశ్ రాజకీయాల గురించి ప్రత్యేకంగా అమేథి గురించి మాట్లాడుతూ..
ప్రజలు అడిగే ప్రశ్నకు ప్రియాంక నేరుగా సమాధానం చెప్పలేరని, ఇప్పటి వరకు కూడా యూపీలో అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా అని పలుమార్లు చాలామంది ప్రశ్నించినా ఆమె సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. అమేథిలో రాహుల్‌గాంధీపై 2014లో మీరు ఓడిపోయారు కదా అని ప్రశ్నించగా అలాంటివి సహజం అని, అయితే, ప్రజలకోసం మాత్రం ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటానని స్మృతి తెలిపారు. ప్రియాంక మాత్రం తనలాగా జనాల్లోకి వెళ్లరని, వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరని, అసంబంద్ధమైన, అమలుచేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచి నేడు వాటిని తీర్చలేకపోయారు కాబట్టే ప్రియాంక జనాలకు దూరంగా ఉంటారని విమర్శించారు.